భక్తులకు ఇబ్బంది కలగకుండా చూడాలి
ధర్మపురి: త్వరలో జరిగే ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలపై జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులతో బుధవారం సమీక్షించారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు. ఈనెల 10 నుంచి 22 వరకు నిర్వహించే ఉత్సవాల ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించారు. గోదావరిలో భక్తులు స్నానాలు ఆచరించే పుష్కరఘాట్లను పరిశీలించారు. గోదావరి తీరంలో లైట్లు, చలువ పందిల్లు, మహిళలు బట్టలు మార్చుకునేందుకు గదులు, తాగునీరు, మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆలయ ప్రాంగణంలో నిత్యం శానిటేషన్ చేపట్టాలన్నారు. ప్రభుత్వ విప్ లక్ష్మణ్‌కుమార్ ప్రతిపాదించిన శ్రీమట్టంలో నాలుగెకరాల ఖాళీ స్థలంలో స్వామివారి కల్యాణానికి దేవాదాయ శాఖ అనుమతి తీసుకోవాలని, వేదికకు కావల్సిన ఏర్పాట్లు పూర్తి చేయాలని పేర్కొన్నారు. గతేడాది సుమారు 3 లక్షల మంది భక్తులు వచ్చారని, ఈసారి 10శాతం మంది భక్తులు పెరిగే అవకాశాలు ఉన్నాయని, వారందరికీ సరిపడా ఏర్పాట్లు చేయాలని సూచించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులు పరిశీలించారు. ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు పరిశీలించి వాటిపై సమీక్షించారు. ఇంటి పన్ను 100 శాతం వసూలు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఈవో శ్రీనివాస్, మున్సిపల్ ఇరిగేషన్ అధికారి నారాయణ, ఆర్‌డబ్లూఎస్ ఈఈ, డిప్యూటీ తహసీల్దార్ సుమన్ తదితరులు పాల్గొన్నారు.
జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ నృసింహుని బ్రహ్మోత్సవాలపై సమీక్ష
Comments
Please login to add a commentAdd a comment