
వందశాతం పన్నులు వసూలు చేయాలి
కోరుట్ల: పట్టణంలోని మున్సిపల్ కార్యాలయాన్ని అదనపు కలెక్టర్ బీఎస్ లత బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులు పరిశీలించారు. ఎల్‌ఆర్‌ఎస్, ఇంటి పన్ను వసూళ్లు మార్చి చివరి వరకు వందశాతం పూర్తి చేయాలని ఆదేశించారు. పట్టణంలోని అల్లమయ్య గుట్ట ఈద్గా వద్ద పారిశుధ్య పనులను మున్సిపల్ కమిషనర్ మారుతీ ప్రసాద్ పరిశీలించారు. చెత్తా చెదారం పూర్తి స్థాయిలో తొలగించాలని ఆదేశించారు.
మెరుగైన విద్యుత్ అందిస్తాం
మేడిపల్లి: అంతరాయం లేని నిరంతర విద్యుత్ సరఫరా అందించడంలో భాగంగా మేడిపల్లి మండలంలోని వల్లంపల్లి ఉప విద్యుత్ కేంద్రంలో సుమారు రూ.10లక్షల విలువైన బ్రేకర్‌ను బుధవారం విద్యుత్ అధికారులు బిగించారు. ఈ బ్రేకర్‌ను టీజీఎన్‌పీడీసీఎల్ చీఫ్ ఇంజినీర్, జగిత్యాల జిల్లా నోడల్ అధికారి వెంకటరమణ ప్రారంభించారు. ఈ బ్రేకర్ ఏర్పాటుతో వల్లంపల్లి రూరల్ ఫీడర్ పరిధిలోని వినియోగదారులు, రైతులు నాణ్యమైన విద్యుత్ పొందుతారని తెలిపారు. రైతులు విద్యుత్ భద్రతా సూచనలు పాటించాలని, విద్యుత్ సమస్యలు పరిష్కారం కోసం స్థానిక సిబ్బందిని సంప్రదించాలని కోరారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి 1912 టోల్‌ఫ్రీ నంబరును సంప్రదించాలన్నా రు. జిల్లా విద్యుత్ అధికారి సాలియా నాయక్, డీఈలు గంగారాం, రవీందర్, ఏడీఈలు రఘుపతి, రాజు, ఆంజనేయులు, మనోహర్, ఏఈ అర్జున్, అశోక్ పాల్గొన్నారు.
మహిళల హక్కులపై అవగాహన ఉండాలి
జగిత్యాల: మహిళల హక్కులపై అవగాహన ఉండాలని డీడబ్ల్యూవో నరేశ్ అన్నారు. శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలో మ హిళల హక్కులు, లింగ సమానత్వంపై బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా నరేశ్ మాట్లాడుతూ, మహిళల కోసం అనేక చట్టాలు వచ్చాయని, వారికి సేవలందించేందుకు సఖీ సెంటర్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. పనిచేసే చోట లైంగిక వేధింపులకు గురైతే ఫిర్యాదు చేయవచ్చని, ప్రతీ ఒక్కరు వాటి గురించి తెలుసుకోవాలన్నా రు. అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు పూర్తి స్థాయిలో పౌష్టికాహారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీడీపీవో మమత, మధు, లక్ష్మణ్, అశ్విని, స్వప్న, గౌతమి పాల్గొన్నారు.
నేడు జిల్లాలో బీసీ కమిషన్ చైర్మన్ పర్యటన
జగిత్యాల: జిల్లాలో గురువారం బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ పర్యటిస్తున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి సునీత తెలిపారు. వంశరాజ్ దొమ్మరి వీరభద్రయ కులాల స్థితిగతులను అధ్యయనం చేయనున్నారని, అనంతరం ధర్మపురిలో సైతం పర్యటించనున్నట్లు తెలిపారు. ఉదయం 8.30 నుంచి 12.30 వరకు గాంధీనగర్, టీఆర్‌నగర్‌లో సందర్శిస్తారని తెలిపారు. ధర్మపురికి 3.30కు వెళ్లనున్నట్లు తెలిపారు.
ఉపాధి అవకాశాల కోసం డీఈఈటీ
జగిత్యాల: రాష్ట్ర ప్రభుత్వం వాణిజ్యశాఖ ఆధ్వర్యంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు డిజిటల్ ఎంప్లాయీమెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ ఇటీవల ప్రారంభించిందని జిల్లా పరిశ్రమలశాఖ జనరల్ మేనేజర్ యాదగిరి తెలిపారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు నిరంతర ఉద్యోగాల కల్పన కోసం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్సీ (ఏఐ)తో కూడిన డీఈఈటీ అంతర్జాతీయ వేదికలను ఇటీవల పెద్దపల్లిలో ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించారని, ఈ వేదికలో ఎలాంటి ఖర్చు లేకుండా ఉచితంగా నమోదు చేసుకోవచ్చన్నారు. విద్యార్హతలు, నైపుణ్యాలతో దరఖాస్తు పూర్తి చేసుకున్న తర్వాత సమాచారాన్ని వారే పంపించడం జరుగుతుందని వివరించారు.

వందశాతం పన్నులు వసూలు చేయాలి