
పరువు హత్యకాదు.. కుట్రపూరిత హత్య
ఎలిగేడు(పెద్దపల్లి): ముప్పిరితోటకు చెందిన పూరె ల్ల సాయికుమార్‌ది పరువు హత్య కాదని, కుట్రపూరితంగా చేసిన హత్యేనని పౌరహక్కులు, విప్లవ రచయితలు, తెలంగాణ ప్రజాఫ్రంట్, దళిత లిబరేషన్ ఫ్రంట్ నాయకులు ఆరోపించారు. ముప్పిరితోటలో హత్య జరిగిన ప్రదేశాన్ని సోమవారం వారు సందర్శించారు. మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం పెద్దపల్లి ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసి న విలేకరుల సమావేశంలో పౌరహక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మాధన కుమారస్వామి, దళిత లిబరేషన్ ఫ్రంట్ ప్రధానకార్యదర్శి మార్వాడి సుదర్శన్, తెలంగాణ ప్రజాఫ్రంట్ జిల్లా కన్వీనర్ గుమ్మి కొమురయ్య మాట్లాడారు. గౌడ సామాజిక వర్గానికి చెందిన పూరెల్ల పరుశరాములు–జ్యోత్స్న కుమారుడు సాయికుమార్ పదో తరగతి పూర్తిచేసి డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని, అదే గ్రామంలోని ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ముత్యం సమత–సదయ్యల కూతురు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారని తమ నిజనిర్ధారణలో తేలిందన్నారు. ప్రేమ వ్యవహారం రెండు కుటుంబాలు, గ్రామస్తులకు తెలుసని అన్నారు. యువతి చదువు పూర్తయ్యాక పె ళ్లి చేసుకునేందుకు నిర్ణయించగా. ఇష్టం లేని యువ తి తల్లిదండ్రులతోపాటు మేనమామ సిద్ధ సారయ్య అదే గ్రామానికి చెందిన మరో ఇద్దరి ప్రోద్బలంతో సాయికుమార్ హత్యకు కుట్ర చేశారని అన్నారు. స్నేహితులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్న సాయికుమార్‌ను గొడ్డలితో నరికి చంపారని తమ విచారణలో తేలిందని చెప్పారు. గతంలో రెండుసార్లు సాయికుమార్‌పై దాడి జరిగినా పోలీసులు స్పందించలేదని తెలిపారు. అధికార, ప్రతిపక్షపార్టీలు ఈ ఘటనకు బాధ్యత వహించాలన్నారు. ఈ హత్యను తాము ఖండిస్తున్నామని అన్నారు. ప్రేమ, కులం, మతం పేరిట జరిగే హత్యల నివారణకు ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కేసు విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్‌కోర్టును ఏర్పాటు చేయాలని, సాయికుమార్ కుటుంబానికి రూ.కోటి పరిహారం చెల్లించాలని వారు కోరారు. పౌరహక్కుల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు శ్రీపతి రాజగోపాల్, విప్లవ రచయితల సంఘం కన్వీనర్ బాలసాని రాజయ్య, నాయకులు బొంకూరి లక్ష్మణ్, ఎన్.సత్యనారాయణ, పుట్ట రాజన్న, రెడ్డిరాజుల సంపత్ పాల్గొన్నారు.
సాయికుమార్ హంతకులను కఠినంగా శిక్షించాలి
పౌరహక్కులు, ప్రజాసంఘాల నాయకుల డిమాండ్