
యమ ధర్మరాజుకు ప్రత్యేక పూజలు
ధర్మపురి: భరణి నక్షత్రం సందర్భంగా శ్రీయమధర్మరాజు దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నృసింహాస్వామి ఆలయ ఈవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో వేదపండితులు బొజ్జ రమేష్‌శర్మ మంత్రోచ్ఛరణలతో స్వామివారికి రుద్రాభిషేకం, మన్యసూక్తం, ఆయుష్యసూక్తంతో అభిషేకం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఆయుష్షు హోమం హారతి, మంత్రపుష్పం చేశారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ చైర్మన్ జక్కు రవీందర్, ధర్మకర్తలు, సూపరింటెండెంట్ కిరణ్ తదితరులున్నారు.
నేషనల్ హ్యూమన్ రైట్స్ జిల్లా అధ్యక్షుడిగా నవీన్
కథలాపూర్: నేషనల్ హ్యూమన్ రైట్స్ జిల్లా అ ధ్యక్షుడిగా మండలంలోని భూషణరావుపేట జెడ్పీ హైస్కూల్ పీడీ వాసం నవీన్‌కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు సంస్థ వ్యవస్థాపకులు మంగంపెల్లి హుస్సేన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. నవీన్‌కుమార్ పాఠశాలల్లో పీడీగా విధులు నిర్వర్తిస్తూనే తీరిక వేళల్లో పలు సామాజిక కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు. ఆయన సేవలను గుర్తించి జిల్లా అధ్యక్షుడిగా నియమించామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నవీన్‌కుమార్ నియామకం పట్ల పాఠశాల ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.
జిల్లాకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షసూచన
జగిత్యాలఅగ్రికల్చర్: ఈ నెల రెండో తేదీ నుంచి ఐదో తేదీ వరకు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడిన ఈదురుగాలులతో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం డైరెక్టర్ శ్రీలత తెలిపారు. రాబోయే ఐదు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 36నుంచి 38 డిగ్రీల సెల్సియస్‌గా, కనిష్ట ఉష్ణోగ్రతలు 25 నుంచి 26 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు అయ్యే అవకాశం ఉందన్నారు.
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు
జగిత్యాల: నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రకటించిన రాజీవ్ యువ వికాసం గడువు పొడిగించిందని, అర్హులు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సత్యప్రసాద్ ఒక ప్రకటనలో కోరారు. అర్హులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సాంకేతిక సమస్యలు వస్తే ఎంపీడీవో, మున్సిపల్ కార్యాలయంలో అందించాలని పేర్కొన్నారు.
4న జిల్లాకు ఎస్సీ, ఎస్టీ చైర్మన్ రాక
జగిత్యాల: ఎస్సీ, ఎస్టీ కమిటీ చైర్మన్, సభ్యులు జిల్లాలో శుక్రవారం పర్యటించనున్నారు. ఉదయం వేములవాడ రాజన్నను దర్శించుకుని మధ్యాహ్నం 2.30 గంటలకు కలెక్టరేట్‌లో జరిగే సమావేశానికి హాజరుకానున్నారు. అనంతరం వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
హెచ్‌సీయూ భూములు అమ్మొద్దు
జగిత్యాల: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల అమ్మకాలను వెంటనే ఆపాలని సీపీఎం జిల్లా కార్యదర్శి శ్రీకాంత్ అన్నారు. కొత్తబస్టాండ్ వద్ద మంగళవారం సీపీఎం ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 400 ఎకరాల సెంట్రల్ యూనివర్సిటీ భూమిని అమ్మకానికి పెట్టే ప్రయత్నాలు విరమించుకోవాలన్నారు. విద్యార్థులపై కేసులను ఉపసంహరించుకుని అరెస్ట్ చేసిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలన్నారు. కార్యక్రమంలో తిరుపతినాయక్, వినోద్‌నాయక్ పాల్గొన్నారు.

యమ ధర్మరాజుకు ప్రత్యేక పూజలు

యమ ధర్మరాజుకు ప్రత్యేక పూజలు