
‘ఉపాధి’ కూలీలకు వేసవి భత్యం ఇవ్వాలి
జగిత్యాలటౌన్: ఉపాధి కూలీలకు వేసవి భత్యం అందించాలని, రూ.400 కూలి చెల్లించాలని మాజీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి కోరారు. జిల్లాకేంద్రంలోని ఇందిరాభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. ఉపాధి హామీ పనుల్లో భాగంగా ఎస్సారెస్పీ కాలువల్లో పూడికతీత పనులు చేపట్టాలన్నారు. రాష్ట్రంలో నీటి సంఘాలను పునరుద్ధరించాల్సిన ఆవశ్యకత ఉందని, ఈ విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉందని పేర్కొన్నారు. సమావేశంలో నాయకులు బండ శంకర్, చందా రాధాకిషన్, బొల్లి శేఖర్, గుంటి జగదీశ్వర్, మహ్మద్ భారీ, గుండ మధు, ముకేష్‌ఖన్నా పాల్గొన్నారు.
సర్వాయి పాపన్నకు నివాళి
జగిత్యాలటౌన్: బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి సర్దార్ సర్వాయి పాపన్న అని అదనపు కలెక్టర్ లత అన్నారు. కలెక్టరేట్‌లో బుధవారం పాపన్నగౌడ్ వర్ధంతిని అధికారికంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం లత మట్లాడారు. సాధారణ గీత కార్మిక కుటుంబంలో పుట్టి బడుగు, బలహీన వర్గాలను ఏకం చేసి గోల్కొండ కోటను ఏలిన రాజు సర్వాయి పాపన్న అని కొనియాడారు. ఆయన స్పూర్తితో యువత ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్, గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్‌గౌడ్, బీసీ వెల్ఫేర్ అధికారి రాజ్‌కుమార్, మెప్మా ఏఓ దుర్గపు శ్రీనివాస్‌గౌడ్, బండ శంకర్, హరి అశోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో పోలీస్‌యాక్ట్ అమలు
జగిత్యాలక్రైం: శాంతిభద్రతల నేపథ్యంలో ఈనెల 30 వరకు జిల్లావ్యాప్తంగా సిటీ పోలీస్‌యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ అశోక్‌కుమార్ తెలిపారు. పోలీసు అధికారుల అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్‌లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని, శాంతిభద్రతలకు భంగం కలిగించేలా, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించే చట్టవ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదని సూచించారు.

‘ఉపాధి’ కూలీలకు వేసవి భత్యం ఇవ్వాలి