
అయోధ్య రామయ్య.. ఉప్పుమడుగు సీతమ్మ
● రెండు గ్రామాల ఐకమత్యం ● నేటి నుంచి శ్రీరామనవమి ఉత్సవాలు
రాయికల్: అయోధ్య అనగానే శ్రీరాముని జన్మస్థలమే మనకు గుర్తుకొస్తుంది. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యనే కాదు రాయికల్ మండలంలోనూ అయోధ్య గ్రామం ఉంది. ఈ గ్రామం ఏర్పడినప్పటి నుంచి 38 ఏళ్లుగా శ్రీరామనవమి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. శ్రీరాముడు వనవాస సమయంలో గ్రామానికి వచ్చాడని అందుకే కోదండ రామాలయం నిర్మించామని ప్రజ లు తెలుపుతున్నారు. అయితే అయోధ్య, ఉప్పుమడుగు (జంట)గ్రామాలు కలిసి ఉంటాయి. ఈ రెండు గ్రామాల ప్రజలు కలిసికట్టుగా ఏటా శ్రీరా మనవమి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ ఐక్యత చాటుతున్నారు. అయితే అయోద్యలోని రామయ్యకు ఉప్పుమడుగు నుంచి సీతమ్మను తీసుకొని వివాహం జరిపిస్తారు. ఏటా జరిగే శ్రీరాముని కల్యాణానికి ప్రభుత్వం తరఫున తహసీల్దార్ దంపతులు ముత్యాల తలంబ్రాలు తీసుకొని కల్యాణ తంతును వైభవంగా నిర్వహిస్తారు.
కల్యాణానికి ఘనంగా ఏర్పాట్లు
శనివారం నుంచి నిర్వహించే శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం నిర్వహించనున్న కల్యాణానికి ఘనంగా ఏర్పాట్లు చేశారు. జగిత్యాల జిల్లా నుంచి వేలాది మంది భక్తులు కల్యాణ మహోత్సవంలో పాల్గొని తిలకించనున్నారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు.