సబ్బులు లేవు.. నూనె ఇవ్వరు | - | Sakshi
Sakshi News home page

సబ్బులు లేవు.. నూనె ఇవ్వరు

Published Mon, Apr 7 2025 10:10 AM | Last Updated on Mon, Apr 7 2025 10:10 AM

సబ్బు

సబ్బులు లేవు.. నూనె ఇవ్వరు

జగిత్యాల: మున్సిపాలిటీలు పరిశుభ్రంగా ఉండాలంటే పారిశుధ్య కార్మికులదే కీలక పాత్ర. ఒక్కరోజు వారు చెత్త తీయకున్నా.. డ్రైనేజీలు శుభ్రం చేయకున్నా పట్టణమంతా దుర్గంధం వెదజల్లుతుంది. జగిత్యాల బల్దియాలో పాలకవర్గం ఉన్న సమయంలో కేవలం 10మంది కార్మికులకు మాత్రమే సబ్బులు, నూనెలు, బట్టలు ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. మళ్లీ ఇప్పటివరకు ఏ ఒక్క కార్మికుడికి బట్టలుగానీ, సబ్బులుగానీ ఇవ్వలేదు. ఫలితంగా వారు చెత్తను ఉత్తచేతులతోనే తొలగిస్తున్నారు. స్నానం చేద్దామంటే సబ్బులు లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. పని ముగించుకున్న అనంతరం నూనె రాసుకుందామన్నా ఇవ్వడం లేదు. పాలకవర్గం ముగిసి ప్రత్యేధికారుల పాలన వచ్చింది. కనీసం ఇప్పుడైనా కార్మికులకు అందాల్సిన సబ్బులు, నూనె, బట్టలు, ఆర్పన్స్‌ ఇస్తారనుకున్నప్పటికీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.

దుస్తుల పంపిణీలో అవకతవకలు

ఏటా పారిశుధ్య కార్మికులకు దుస్తులు, సబ్బులు, నూనెలు, చెప్పులు, ఆర్పన్స్‌ ఇతరత్రా వస్తువులు అందిస్తుంటారు. మున్సిపాలిటీ వారు ఇస్తే బట్టలు వారే కుట్టించుకుంటారు. కుట్టుకూలీ కింద రూ.300 అందిస్తారు. గతంలో ఉన్న పాలకవర్గమో.. అధికారులో తెలియదు కానీ ఓ కాంట్రాక్టర్‌కు బట్టలు కుట్టే బాధ్యత అప్పగించారు. వారు ఒక జతకు కుట్టుకూలీ రూ.800 వేశారు. కార్మికులు అది ఇవ్వకపోవడం అతని వద్దనే ఉండిపోయాయి. అప్పటి నుంచి కార్మికులకు దుస్తులే లేకుండా పోయాయి. ఎప్పుడో ఇచ్చిన బట్టలతోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఇటీవల మళ్లీ అతనితో బేరమాడి కొన్ని బట్టలు అతడి నుంచి తీసుకుని జిల్లా కేంద్రంలోని అంగడిగద్దె ప్రాంతంలోని ఓ గదిలో నిల్వ ఉంచారు. మరికొద్దిరోజులు అలాగే ఉంటే అవి ఎలుకలపాలో, చెడిపోయే ప్రమాదం ఉంది.

కానరాని సబ్బులు, నూనె, చెప్పులు

పారిశుధ్య కార్మికులకు సబ్బులు, నూనెలు, ఆర్పన్స్‌ చెప్పులు అతి ముఖ్యమైనవి. వీటిని కార్మికులకు ఇచ్చేందుకు ఏటా టెండర్లు పిలుస్తుంటారు. టెండర్‌ దక్కించుకున్న వారికి బిల్లులు ఇవ్వకపోవడంతో వారు అందించండం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఫలితంగా కార్మికులు ఇబ్బందులకు గురవుతున్నారు. కార్మికులు ఉత్త చేతులతోనే పూడిక తీయడంతో పాటు, పరిసరాలను శుభ్రం చేస్తున్నారు. చెత్తాచెదారం తరలిస్తూ పట్టణాన్ని పరిశుభ్రంగా తయారుచేస్తున్న కార్మికులపై కనీసం పట్టించుకోకపోవడంతో విమర్శలకు దారితీస్తోంది.

గాడితప్పుతున్న శానిటేషన్‌

జగిత్యాల బల్దియాలో శానిటేషన్‌ పూర్తిగా గాడితప్పుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కార్మికులకు కావాల్సిన వస్తువులను సరఫరా చేయకపోవడంతో పాటు, వారికి సంబంధించిన వాహనాల మరమ్మతు కోసం అధిక బిల్లులు కేటాయిస్తున్నారని ఆరోపణలున్నాయి. ఆరు వాహనాలు ఇప్పటికే కరీంనగర్‌లోనే మరమ్మతు పేరిట ఉన్నాయి. ఇలా శానిటేషన్‌ విభాగంలో ఏది చూసుకున్నా అవినీతి ఆరోపణలే అత్యధికంగా కన్పిస్తున్నాయి. గతంలో బ్లీచింగ్‌ పౌడర్‌ వాసన లేనిది ఇవ్వడంతో కౌన్సిలర్లు ఈ విషయం లేవనెత్తడంతో వెంటనే వాపస్‌ పంపించారు. ప్రస్తుతం మళ్లీ ఆప్కో వారికి పారిశుధ్య కార్మికుల దుస్తులు ఇచ్చారని, సబ్బులు, నూనెలు, ఆర్పన్స్‌, చెప్పులు, పరికరాలకు సంబంధించిన టెండర్లు జరిగాయని, త్వరలోనే వారికి అందిస్తామని అధికారులు పేర్కొంటున్నారు.

పారిశుధ్య కార్మికుల ఇక్కట్లు

ఉత్త చేతులతోనే చెత్త తొలగింపు

అనారోగ్యంబారిన బల్దియా కార్మికులు

త్వరలో కార్మికులకు అందజేస్తాం

కార్మికులకు త్వరలో దుస్తులు అందజేస్తాం. జోనల్‌ వైజ్‌గా సెట్‌ చేశాం. త్వరలోనే వారికి బట్టలు, నూనెలు, సబ్బులు ఇలా అన్నీ అందించేలా చర్యలు తీసుకుంటాం. గతంలో కొన్ని సమస్యల వల్ల ఇబ్బందికరంగా ఉంది. వాటన్నింటిని రెడీ చేసి పెట్టాం. త్వరలోనే అందజేస్తాం. – స్పందన,

మున్సిపల్‌ కమిషనర్‌, జగిత్యాల

సబ్బులు లేవు.. నూనె ఇవ్వరు1
1/1

సబ్బులు లేవు.. నూనె ఇవ్వరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement