
రూ.10లక్షలు ఖర్చు చేసినా దక్కని ప్రాణం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ యువకుడు ఎనిమిది రోజులు మృత్యువుతో పోరాడి ఓడిపోయాడు. యువకుడి ప్రాణాలు కాపాడుకోవడానికి తల్లిదండ్రులు రూ.10లక్షలు ఖర్చు చేసినా ప్రాణాలు దక్కలేదు. ఈ సంఘటన ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్‌లో విషాదం నింపింది. ఎస్సై రమాకాంత్, గ్రామస్తులు తెలిపిన వివరాలు. నారాయణపూర్‌కు చెందిన షేక్ అవేజ్(18) గత నెల 30న రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి హైదరాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. ఆదివారం రాత్రి మృతి చెందాడు. రంజాన్ పండుగకు ముందు రోజు సిరిసిల్లలోని ఓ టైలర్‌లో కుట్టించిన కొత్త బట్టలు తీసుకురావడానికి తన మిత్రుడు షేక్ అఫ్రోజ్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు. ఎదురుగా వస్తున్న ఆటోను బలంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఇద్దరిని మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అవేజ్ పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఏడు రోజులపాటు చికిత్స అందించారు. ఒక్కగానొక్క కొడుకును కాపాడుకోవడానికి తల్లిదండ్రులు అప్పు చేసి వైద్యం అందించారు. అయినా ప్రాణాలు దక్కకపోవడంతో తండ్రి సమద్, తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గాయపడ్డ మరో యువకుడు అఫ్రోజ్ చికిత్స పొందుతున్నాడు. మృతుని కుటుంబ సభ్యులను బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, రెడ్డి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు గుండారపు కృష్ణారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య, పార్టీ మండల అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి తదితరులు పరామర్శించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ఎనిమిది రోజులు మృత్యువుతో పోరాటం
గాయపడ్డ యువకుడి మృతి
నారాయణపూర్‌లో విషాదం

రూ.10లక్షలు ఖర్చు చేసినా దక్కని ప్రాణం