
కోడికోసం వెళ్లి.. బావిలో పడి
కమాన్‌పూర్(మంథని): వరి పంటను కోసేందుకు సిద్ధమైన రైతు నామని రాజేశం(70) ఆచారం ప్రకారం పొలం వద్ద కోడిని బలిచ్చే ప్రయత్నంలో సమీప వ్యవసాయ బావిలోపడి దుర్మరణం చెందాడు. పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండలం సిద్దిపల్లెలో బుధవారం ఈ ఘటన జరిగింది. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామ శివారులో తనకున్న వరిపొలం వద్దకు బుధవారం ఉదయం కోడిని పట్టుకుని వెళ్లాడు. వరి పైరు కోసేందుకు ముందుగా కోడిని బలి ఇవ్వాలని నిర్ణయించాడు. తనవెంట తెచ్చుకున్న సంచిలోనుంచి కోడిని తీస్తుండగా అది ఎగిరిపోయి పక్కనే ఉన్న వ్యవసాయ బావిలో పడింది. రాజేశం ఆ కోడిని పట్టుకునే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు ఆ బావిలో పడి మృతి చెందాడు. చాలాసేపటి వరకు రాజేశం ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పొలం వద్దకు వెళ్లారు. అక్కడ అటూఇటూ చూడగా ఎక్కడా కనిపించలేదు. చివరకు వ్యవసాయ బావిలో చూడగా శవమై కనిపించాడు. అప్పటిదాకా తమతో ఉన్న రాజేశం బావిలోపడి విగతజీవిగా మారడంతో కుటుంబసభ్యుల విలపించారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్సై ప్రసాద్ కేసు నమోదు చేసుకొన్నారు.
వ్యవసాయ బావిలో పడి రైతు దుర్మరణం