
నీటికొరత రాకుండా చర్యలు
బుగ్గారం (ధర్మపురి): ధర్మపురి పట్టణంలో తాగునీటికి కొరత రాకుండా చర్యలు చేపడుతున్నట్లు ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. మున్సిపల్ కార్యాలయం ఆవరణలో గురువారం రెండు నీటి ట్యాంకర్లను ప్రారంభించారు. పట్టణానికి నీటి సరఫరాకు సహాయం చేస్తానని తెలిపారు. అనంతరం అక్కపల్లి రాజేశ్వరస్వామి ఆలయ సమీపంలోని ఇందిరమ్మ కాలనీలో పర్యటించారు. అక్కడి అభివృద్ధి పనులను పరిశీలించారు. అమృత్ పథకంలో భాగంగా చేపడుతున్న పైప్‌లైన్ పనులను ప్రారంభించారు. నాయకులు సంగనభట్ల దినేష్, వేముల రాజు, వొజ్జల లక్ష్మణ్, ప్రసాద్, జక్కు రవీందర్, సీపతి సత్యనారాయణ, కస్తూరి శ్రీనివాస్, చిలుముల లక్ష్మణ్, సుముఖ్ పాల్గొన్నారు.
రోళ్లవాగు ముంపు అటవీప్రాంతం పరిశీలన
సారంగాపూర్: బీర్‌పూర్ శివారులోని రోళ్లవాగు ప్రాజెక్టు నిర్మాణంలో అటవీశాఖ కోల్పోతున్న భూములు, అటవీప్రాంతాన్ని గురువారం అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్ సి.సరవనన్ (నిర్మల్) పరిశీలించారు. అటవీశాఖకు జరుగుతున్న నష్టంపై ఆరా తీశారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.136.81 కోట్లతో చేపట్టిన ప్రాజెక్టు నిర్మాణంలో అటవీశాఖకు చెందిన 816 ఎకరాల భూమి ముంపునకు గురవుతోందని, ఇందులో 53వేల చెట్లకు నష్టం వాటిల్లుతోందని అటవీశాఖ ఇచ్చిన నివేదికను ఆయన పరిశీలించారు. ముంపు భూములకు బదులు ప్రభుత్వం గొల్లపల్లి, పెగడపల్లి, వెల్గటూర్ మండలాల్లో కేటాయించిన భూములను పరిశీలించారు. ఆయన వెంట డీఎఫ్‌వో రవిప్రసాద్, డిఈ చక్రూనాయక్, అధికారులు ఉన్నారు.
అరగంటలోపే రిజిస్ట్రేషన్
జగిత్యాలటౌన్: స్లాట్ బుక్ చేసుకున్న అరగంటలోపే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేస్తున్నామని జగిత్యాల సబ్ రిజిస్ట్రార్ సుజాత అన్నారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా గురువారం జగిత్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నూతన విధానంలో టైంస్లాట్ బుక్ చేసుకున్న కొనుగోలుదారుకు అరగంట లోపే రిజిస్ట్రేషన్ పూర్తి చేసి డాక్యుమెంట్‌ను అందించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా డీఐజీ (స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్) రవీందర్, సిబ్బంది పాల్గొన్నారు.
నేడు డయల్ యువర్ డీఎం
జగిత్యాలటౌన్: ప్రయాణికుల సమస్యల పరిష్కారం, మెరుగైన రవాణా సౌకర్యం అందించేందుకు శుక్రవారం డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ జగిత్యాల డిపో మేనేజర్ కల్పన తెలిపారు. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు 99592 25925నంబర్‌కు ఫోన్ చేసి సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు.
మహిళలు ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలి
జగిత్యాలరూరల్: మహిళలు అరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలని, సరైన పౌష్టికాహారం తీసుకోవాలని మార్కెటింగ్ డీపీఎం మల్లేషం, ఫైనాన్స్ డీపీఎం విజయభారతి అన్నారు. జగిత్యాలలోని ఐకేపీ కార్యాలయంలో వీఓఏలతో సమావేశమయ్యారు. పోషక పక్షం–పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు. గర్భిణులు ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం పోషకాహారం తీసుకోవాలన్నారు. యాసంగి సీజన్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కనీస వసతులు కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీఎం గంగాధర్, సీసీలు మరియా, రవీందర్, శ్రీనివాస్, మండల సమాఖ్య అధ్యక్షురాలు మారు సత్తవ్వ, కోశాధికారి శ్రీలత, మాజీ కార్యదర్శి భారతి పాల్గొన్నారు.

నీటికొరత రాకుండా చర్యలు

నీటికొరత రాకుండా చర్యలు