
చదువు ప్రాముఖ్యతను చాటిన పూలే
జగిత్యాలటౌన్: చదువుతోనే జీవితంలో మార్పు సాధ్యమని భావించి, విద్యా ప్రాముఖ్యతను చాటిచెప్పిన మహనీయుడు జ్యోతిరావుపూలే అని కలెక్టర్ సత్యప్రసాద్ పేర్కొన్నారు. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో శుక్రవారం వెనుకబడిన తరగతుల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాత్మా జ్యోతిబాపూలే 199వ జయంతి వేడుకల్లో కలెక్టర్ బి.సత్యప్రసాద్, అదనపు కలెక్టర్ బీఎస్.లత, కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్.రమణ పాల్గొన్నారు. జ్యోతిబాపూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ.. గతంలో వర్ణ, వర్గ, కుల వ్యవస్థ కారణంగా దళితులు, బడుగు బలహీన వర్గాలపై తీవ్ర వివక్ష ఉండేదన్నారు. మహిళలను సమానంగా చూడటం అనే ఆలోచన కూడా లేని రోజుల్లో మహిళా విద్యను ప్రోత్సహించిన మహానీయుడు పూలే అని కొనియాడారు. ఎల్.రమణ మాట్లాడుతూ ప్రభుత్వ విద్యా వ్యవస్థలో నిదానంగా స్పష్టమైన మార్పు కనిపిస్తోందన్నారు. మెరుగైన విద్యాబోధనకు పటిష్ట చర్యలు చేపట్టడమే పూలేకు అసలైన నివాళి అని పేర్కొన్నారు. జిల్లా బీసీ అబివృద్ధిశాఖ అధికారి జి.సునీత, బీసీ సంక్షేమ సంఘం నాయకులు హరి అశోక్‌కుమార్, ముసిపట్ల లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
● కలెక్టర్ సత్యప్రసాద్