
చోరీ చేశారు.. అమ్మలేక దొరికారు
● ట్రాక్టర్ దొంగల అరెస్టు
ముస్తాబాద్(సిరిసిల్ల): జల్సాలకు అలవాటు పడి.. ఈజీ మనీ కోసం దొంగలుగా మారిన ముగ్గురు యువకులు చోరీ చేసిన ట్రాక్టర్, ఖాజ కుట్టుమిషన్లను ఎవరికి అమ్మాలో తెలియక చివరకు పోలీసులకు దొరికారు. సిరిసిల్ల రూరల్ సీఐ మొగిలి తెలిపిన వివరాల ప్రకారం.. ముస్తాబాద్ శుభోదయ మండల సమాఖ్య కార్యాలయంలో ఉన్న ట్రాక్టర్ ఐషర్ ఇంజీన్, కాజా కుట్టు మిషన్లు గత ఫిబ్రవరి 17న అపహరణకు గురయ్యాయి. సమాఖ్య అధ్యక్షురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఎస్సై గణేశ్ విచారణ చేపట్టారు. కాల్‌డాటా, అనుమానితుల కదలికలపై నిఘా పెట్టి ముస్తాబాద్‌కు చెందిన మహ్మద్ షాదుల్లా, దావిరెడ్డి నరేందర్‌రెడ్డి, మహ్మద్ సమీర్‌లు ట్రాక్టర్, కుట్టు మిషన్లను ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. వారిని అరెస్టు చేసి వారి నుంచి ట్రాక్టర్, కుట్టు మిషన్‌తోపాటు ఒక కారు, బైక్, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని సీఐ తెలిపారు. అయితే రెండు నెలల క్రితమే ట్రాక్టర్, మిషన్‌ను అపహరించిన నిందితులు వాటిని ఎవరికి అమ్మాలో తెలియక పొలాల మధ్య దాచిఉంచారన్నారు. రూ.7లక్షల విలువైన ట్రాక్టర్, కుట్టు కాజా మిషిన్‌ను స్వాధీనం చేసుకోవడంలో ఎస్సై గణేశ్, హెడ్‌కానిస్టేబుల్ బాలనర్సయ్య, కానిస్టేబుల్ ఖాసీంలను సీఐ అభినందించారు.