
ధాన్యంలో కోత విధించొద్దు
● ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్
పెగడపల్లి: ధాన్యంలో మిల్లర్లుగానీ, కొనుగోలు కేంద్రాల నిర్వహకులుగానీ కోత విధిస్తే క్షమించేది లేదని ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ హెచ్చరించారు. తూకంలో తేడా, ధాన్యంలో కోత ఉన్నట్లు ఫిర్యాదులు వస్తే నిర్వాహకులపై చర్యలుంటాయన్నారు. మండలంలోని ఆరవెల్లిలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం ప్రారంభించారు. ధాన్యం తూకం చేసిన వెంటనే రైతులకు ట్రక్‌షీట్ ఇవ్వాలని, మిల్లులో ధాన్యం దిగుమతి అయ్యే వరకు నిర్వాహకులే బాధ్యత వహించాలని సూచించారు. తూకం చేశాక రైతులకు ఎలాంటి సంబంధమూ ఉండకూడదన్నారు. రైతులు ఽనాణ్యతతో కూడిన ధాన్యం తెచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. ఏఎంసీ చైర్మన్ రాములుగౌడ్, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శోభారాణి, ఏఎంసీ వైస్ చైర్మెన్ సత్తిరెడ్డి, డైరెక్టర్లు, నాయకులు తిరుపతి, కాంతయ్య, శ్రీనివాస్, మురళి పాల్గొన్నారు.