మరో అవకాశం!
● జిల్లాలో నేటి నుంచి కులగణన
● ప్రజాపాలన కేంద్రాల్లో వివరాల నమోదు
జనగామ: రాష్ట్రంలో తొలిసారి చేపట్టిన కులగణన సర్వే (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే)కు ప్రభుత్వం మరోసారి శ్రీకారం చుట్టింది. గతేడాది చేపట్టిన సర్వేలో వివిధ కారణాలతో తమ వివరాలను నమోదు చేయించుకోలేని కుటుంబాలకు రెండవసారి అవకాశం కల్పించింది. నేటి నుంచి ఈ నెల 28వ తేదీ వరకు కుల గణన సర్వే జరగనుంది. ఇందుకు సంబంధించి 12 మండలాల పరిధిలో ప్రజాపాలన సేవా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు సర్వేకు దూరంగా ఉన్న కుటుంబాలు ఆన్‌లైన్‌లో పొందుపరిన ఫారాన్ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. అందులో కుటుంబ సమగ్ర వివరాలను పూర్తి చేసి, ప్రజాపాలన సేవా కేంద్రంలోని అధికా రికి అందజేసి పేరును నమోదు చేసుకోవాలి. సందేహాల నివృత్తికి టోల్ ఫ్రీ నంబర్ 9052 308 621కు ఫోన్ చేసి సలహాలు, సూచనలు పొందవచ్చు.
సర్వేకు దూరంగా 15వేల కుటుంబాలు
గత ఏడాది నవంబర్ 6వ తేదీ నుంచి 8 వరకు ఇంటింటికీ స్టిక్కరింగ్ వేశారు. 9వ తేదీన మొట్టమొదటి సారిగా కులగణన సర్వే ప్రారంభించారు. 20 రోజుల పాటు సర్వే నిర్వహించి, 1,77,122 కుటుంబాల డాటాను ఆన్‌లైన్ ఎంట్రీ చేశారు. జిల్లాలో సుమారు 15 నుంచి 18 వేల కుటుంబాలు సర్వేకు దూరంగా ఉండగా, రెండవ సారి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం కోరుతుంది. దీంతో కులాల వారీగా జిల్లాలో ఎంత మంది ఉన్నారనే విషయంలో స్పష్టత రానుంది.
సర్వేలో పాల్గొనండి..
ప్రభుత్వం నేటి నుంచి ఈ నెల 28వ తేదీ వరకు రెండవ సారి నిర్వహించే కుల గణనలో వివిధ కారణాలతో దూరంగా ఉన్న కుటుంబాలు తమ వివరాలను నమోదు చేయించుకోవాలి. 12 మండలాల పరిధిలోని ప్రజాపాలన సేవా కేంద్రాల్లో సమగ్ర వివరాలతో అధికారులకు అందించాలి. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకుని, సర్వేకు సహకరించాలి.
– రిజ్వాన్ బాషా, కలెక్టర్
●
మరో అవకాశం!
Comments
Please login to add a commentAdd a comment