దేవరుప్పుల : కల్లబొల్లి హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతల సమస్యలు పట్టించుకోవడంలేదు.. ఇందుకు ఎండిన పొలాల ను చూస్తే అర్థమవుతోంది.. మూడు రోజుల్లో సాగు నీరు అందించకుంటే అవసరమైతే అసెంబ్లీని ముట్టడిస్తామని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఎండిపోయిన వరి పొలాలకు ఎకరాకు రూ.25 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించా లనే డిమాండ్‌తో బీఆర్‌ఎస్ ఆధ్వర్యాన గురువారం స్థానిక చౌరస్తా సమీపాన పల్ల సుందర్‌రామిరెడ్డి అధ్యక్షతన చేపట్టిన రైతు నిరసన దీక్షలో ఆయన మాట్లాడారు. టీడీపీ హయాంలో దేవాదుల పనులు ప్రారంభిస్తే పదేళ్లు పండబెట్టింది కాంగ్రెస్ ప్రభు త్వం కాదా అని ప్రశ్నించారు. తిరిగి కేసీఆర్ ఆ పనులను పునరుద్ధరిస్తే పదిహేను నెలలు దాటినా ఈ సర్కారు వాటి జోలికి వెళ్లలేదన్నారు. రైతులపై చిత్తశుద్ధి లేకనే పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు బిల్లులు ఆపిందని చెప్పారు. జిల్లాలోని యశ్వంతపూర్, బయ్యన్న, ఆకేరు వాగులు ఎందుకు ఎడారిగా మారాయని ప్రశ్నించారు. రైతుల సంక్షేమానికి రైతుబంధు ప్రవేశపెట్టి ఏడాదికి రెండుసార్లు ఇస్తే.. మూడో పంటకి ఎందుకియ్యరని అన్న వాళ్లు ఇప్పు డు సమాధానం చెప్పాలన్నారు. వరి సన్నరకానికి బోనస్, రైతుబంధు, పంట రుణమాపీ అంతా బోగస్ హామీలుగా మారాయని విమర్శించారు. పాలకుర్తి రిజర్వాయర్, కాల్వ మరమ్మతులకు రూ.300 కోట్లతో పనులు ప్రారంభిస్తే ఆపింది మీరు కాదా? అని అన్నారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి కొత్తగా నిధులు తేకున్నా పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు కొనసాగిస్తూ ఓట్లు వేసి గెలిపించిన ప్రజల రుణం తీర్చుకోవాలని సూచించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం వరకూ ప్రదర్శనగా వెళ్లి వినతి పత్రం అందజేశారు. తర్వాత కామారెడ్డిగూడెంలో ఎండిన పొలాలను పరిశీలించారు. కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి మిగిలిన వరి పంటల ను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు తీగల దయాకర్, చింత రవి, రామ్‌సింగ్, బబ్బూరి శ్రీకాంత్‌గౌడ్, బస్వ మల్లేషం, ఈదునూరి నర్సింహారెడ్డి, సాయిలు, కొల్లూరి సోమన్న, ప్రవీణ్, అర్జున్, గాంధీనాయక్, మంగళపల్లి శ్రీనివాస్, సీతారాం శ్రీనివాస్, సోమనర్సయ్య, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
రైతు నిరసన దీక్షలో
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు