రోడ్డుపక్కనే గుంతలోకి దూసుకెళ్లిన ఆటో
అప్రమత్తమైన ఆటోడ్రైవర్
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని చెర్లపాలెంకు చెందిన ఆటోలో అదే గ్రామానికి చెందిన 14 మంది, పక్కనే ఉన్న ఫత్తేపురానికి చెందిన ముగ్గురు.. మొత్తం 17 మంది కూలీలు మిరపతోటలను ఏరడానికి శుక్రవారం ఉదయం మరిపెడ మీదుగా ఖమ్మం జిల్లాలోని తిరుమలా యపాలెం మండలానికి ఆటోలో బయల్దేరారు. ఈక్రమంలో పెద్దనాగారం స్టేజీ సమీపంలోని ఇటుక బట్టీల సమీపంలో మరిపెడ వైపునకు వెళ్తున్న ఆటోను వెనుక నుంచి లారీ అతివేగంతో వస్తూ ఢీ కొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న దర్మారపు సోమక్క, దర్మారపు సునీత, దర్మారపు ఉప్పలమ్మ, గూడెల్లి దుర్గ, గూడెల్లి అరుణ, డ్రైవర్ దర్మారపు పవన్‌కు తీవ్ర గాయాలు, మిగతా వారి స్వల్ప గాయాలు కావడంతో క్షతగాత్రులను మూడు అంబులెన్స్‌లలో మహబూబాబాద్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చెర్లపాలెంకు చెందిన గూడెల్లి అరుణ(40)మృతి చెందింది.
ప్రమాదానికి మూలమలుపే కారణమా..
వరంగల్– ఖమ్మం హైవేపై పెద్దనాగారం స్టేజీ సమీపంలో ఇటుక బట్టీల వద్ద గతంలో సైతం ప్రమాదాలు జరిగాయి. దీంతో ప్రమాదాలకు మూలమలుపే కారణమని, మూలమలుపు వద్ద లారీ అతివేగంతో నియంత్రణ కోల్పోయి వెనుకనుంచి కూలీల ఆటోను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.
ఉలిక్కిపడ్డ చర్లపాలెం..
మిరపతోటలను ఏరడానికి వెళ్తున్న కూలీల ఆటో ప్రమాదా నికి గురికావడంతో చెర్లపాలెం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. కూలీల బంధువులు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. ఎస్సై సురేష్ ఘటన స్థలాన్ని సందర్శించారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ప్రమాదంలో ముళ్ల పొదల్లోకి వెళ్లిన ఆటో
వాళ్లందరు రోజువారీ కూలీలు.. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి.. స్వగ్రామంలో పనిదొరక్క.. పనిని వెతుక్కుంటూ.. ప్రతీ రోజు యాబై కిలోమీటర్లు ఆటోలో వెళ్లి పనిచేసి తిరిగి ఇంటికొస్తారు.. రోజువారీ మాదిరిగానే.. శుక్రవారం కోడికూత వేళకు లేచి మధ్యాహ్నానికి సద్దిమూట పెట్టుకొని కూలీకోసం ఆటోలో బయల్దేరారు. ఈక్రమంలో మూలమలుపు వద్ద లారీ.. వీరి ఆటోమీదకు దూసుకొచ్చింది. దీంతో డ్రైవర్ రోడ్డు పక్కనే ఉన్న చెట్ల పొదల్లోకి ఆటోని తిప్పాడు.. రోడ్డుపక్కనే వేసిన సిమెంట్ దిమ్మెకు తాకి ఆటో బోల్తా పడడంతో ఒకరు మృతి చెందగా తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు.
– నర్సింహులపేట
ఆటోడ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం
కూలీల ఆటో పెద్దనాగారం సమీపంలోని మూలమలుపు వద్దకు రాగానే లారీ ఒక్కసారిగా ఆటోవైపు దూసుకొచ్చింది.. అంతా లారీ కింద పడిపోయామని భావించగా.. ఆటో నడుపుతున్న దర్మారపు పవన్ అప్రమత్తమై.. పక్కనే ఉన్న చెట్లపొదల్లోకి ఆటోను తిప్పాడు. అప్పటికే వేగంతో ఉన్న ఆటో అదుపుతప్పి పొదల్లోని సిమెంట్ దిమ్మెను తగిలి పల్టీ కొట్టింది. లారీ కింద పడి ప్రాణాలు కోల్పోయేకంటే గాయపడడం మేలనే ఉద్దేశంతో ఆటోను రోడ్డు పక్కకు తిప్పనట్టు డ్రైవర్ పవన్ ఏడుస్తూ చెప్పడం అందరిని కంటతడి పెట్టించింది.
బడుగులపైకి దూసుకొచ్చిన లారీ
బడుగులపైకి దూసుకొచ్చిన లారీ