దంతాలపల్లి: ఆరుగాలం కష్టం చేసి చేతికొచ్చిన పంటను తరలిస్తూ.. ఓ రైతు మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం బొడ్లాడ గ్రామ శివారులో గురువారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నర్సింహులపేట మండలం కొమ్ములవంచ గ్రామ శివారు దుబ్బతండాకు చెందిన జాటోత్ రమేష్(35)కు బొడ్లాడ గ్రామ శివారులో వ్యవసాయ భూమి ఉంది. తన చేనులో పండిన మొక్కజొన్న కంకులను ట్రాక్టర్ సాయంతో స్వయంగా ఒకచోటుకు తరలిస్తున్నాడు. ఈ క్రమంలో ట్రాక్టర్‌లో పోసిన కంకులను అన్‌లోడ్ చేసిన అనంతరం ట్రాలీ కిందకు దిగలేదు. దీంతో సరిచేసే క్రమంలో ట్రాలీ ఒక్కసారిగా రమేష్‌పై పడడంతో మృతి చెందాడు. మృతుడికి భార్య లీల, ఇద్దరు కుమారులు చేతన్, రంజిత్ ఉన్నారు. లీల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై రాజు తెలిపారు.
అప్పుల బాధతో మొక్కజొన్న రైతు ఆత్మహత్య
వెంకటాపురం (కె): అప్పులబాధతో మొక్కజొన్న రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ములుగు జిల్లా వెంకటాపురం (కె) మండలం బర్లగూడెం పంచాయతీ పరిధి చిరుతపల్లి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. చిరుతపల్లి గ్రామానికి చెందిన లుక మధుకృష్ణ (29) అనే రైతు రెండెకరాల్లో బాండ్ మొక్కజొన్న సాగు చేశాడు. చేను దిగుబడి రాక పోవడంతో పెట్టిన పెట్టుబడి రాక రూ.లక్ష మేర అప్పుల పాలయ్యాడు. దీంతో మనస్తాపానికి గురై గురువారం ఉదయం పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతన్ని వెంటనే వెంకటాపురం వైద్యశాలకు తరలించి చికిత్స నిర్వహించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వరంగల్ ఎంజీఎంకు తరలించగా, చికిత్స పొందుతూ శుక్రవారం చనిపోయాడు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలున్నారు.
పంటను తరలిస్తూ పరలోకాలకు..