డిమాండ్ చేస్తున్నారు.. రిమాండ్‌కు వెళ్తున్నారు
● జిల్లాలో చేతులు తడపందే కదలని ఫైళ్లు
● ఏసీబీకి పట్టుబడుతున్నా.. మారని మామూళ్ల బాగోతం
● వృత్తి ధర్మాన్ని మరచిపోతున్న ఉద్యోగులు
● కాచుకుని చూస్తున్న ‘మూడోకన్ను’
● డబ్బులు అడిగితే 9154388912 నంబర్‌కు ఫోన్ చేయండి
● ఉమ్మడి వరంగల్ జిల్లా ఏసీబీ డీఎస్పీ సాంబయ్య
ఏసీబీ ప్రత్యేక నిఘా
జిల్లాలో ఏసీబీ కేసులు అత్యధికంగా నమోదు కావడంతో ఈ ప్రాంతంపై నిఘా రెట్టింపు చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రజా సంబంధాలకు దగ్గరగా ఉన్న ఓ ప్రధాన కార్యాలయంతో పాటు సమీకృత కలెక్టరేట్‌లోని కొన్ని శాఖల పరిధిలో ఏసీబీ ఫిర్యాదు అందినట్టు విశ్వసనీయ సమాచారం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యధిక ఏసీబీ కేసులుగా జనగామకు ప్రత్యేక స్థానం ఉందని చెప్పుకోవచ్చు. ఏసీబీకి ఇంత పెద్ద మొత్తంలో ఉద్యోగులు పట్టుబడుతున్నా.. కొన్ని శాఖల్లో మాత్రం మామూళ్ల డిమాండ్ ఆగడం లేదని ప్రజలు మాట్లాడుకుంటున్నారు.
జనగామ: వేలకు వేలు వేతనాలు వస్తున్న ఉద్యోగులు, అధికారులు వృత్తి ధర్మాన్ని మరు స్తున్నారు. అంకితభావంతో పని చేస్తూ అటు ప్రభుత్వం.. ఇటు ప్రజలకు వారధిగా నిలవాల్సిన ఉద్యోగులు అడ్డదారి సంపాదనకు అలవాటు పడిపోతున్నారు. పని ఏదైన పైసలు లేనిదే ఫైల్ కదలని పరిస్థితి. ప్రతీ పనికి ఒక రేటు ఫిక్స్ చేసి.. కింది స్థాయి సిబ్బంది.. మధ్యదళారులను ఏర్పాటు చేసుకుని టేబుల్ కింద నుంచి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. భూ సంబంధింత పనుల నుంచి ఇంటి అనుమతుల వరకు.. లక్షల్లో డిమాండ్ చేస్తూ.. అడ్డదారి సంపాదనకు ఆశపడుతూ ఏసీబీకి పట్టుబడుతూ డైరెక్టుగా చర్లపల్లి జైలుకుపోతున్నారు. జిల్లాలో పుష్కర కాలంగా ఏసీబీకి పట్టుబడిన ఉద్యోగులు, అధికారులు, ఉన్నతాధికారుల బాగోతంపై సాక్షి ప్రత్యేక కథనం.
లంచాలకు అలవాటు పడి..
ఏసీబీ రోజురోజుకు దూకుడు పెంచేస్తోంది. లంచాలకు అలవాటు పడి.. జలగలా పట్టి పీడిస్తున్నా ఉద్యోగులు, అధికారుల తాట తీస్తోంది. లంచం డిమాండ్ చేస్తూ వల వేసి పట్టేస్తూ... జైలుకు పంపిస్తున్నారు. అయినా వారిలో మార్పు రావడం లేదు. మామూళ్లు డిమాండ్ చేస్తే సమాచారం అందించాలని ఏసీబీ ఫోన్ నంబర్లతో మారుమూల పల్లె వరకు విస్తృత ప్రచారం చేస్తున్నా.. అడ్డదారిలో వసూళ్ల దందా ఆగడం లేదు. జిల్లాలో గడిచిన పుష్కర కాలంలో 34 మంది వరకు అధికారులు, ఉన్నతాధికారులు, సిబ్బంది, ప్రైవేట్ వ్యక్తులు పట్టుబడగా.. ఇటీవల వరుసగా నమోదవుతున్న కేసులతో ఆయా శాఖల్లోని అవినీతి పరుల గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. ఈ మధ్య కాలంలో మున్సిపల్ కమిషనర్ రజిత, షెడ్యూల్డ్ కులాల జిల్లా అధికారి గట్టుమల్లు, డీఎంహెచ్‌ఓ ప్రశాంత్, స్టేషన్‌ఘన్‌పూర్ సబ్ రిజిస్ట్రార్ రామకృష్ణ, ఇరిగేషన్ డీఈ రవీందర్ రెడ్డి, ఎన్‌పీడీసీఎల్ డీఈ హుస్సేన్ నాయక్, ఆర్‌అండ్‌బీ ఈఈ హుస్సేన్ మంచి పొజిషియన్‌లో ఉండి, సరిపడా వేతనాలు వస్తున్నా.. లంచం డిమాండ్ చేసి ఉద్యోగం ఊడిపోయి జైలు పాలయ్యారు. ఒక్కసారి ఏసీబీకి పట్టుబడితే సర్వీస్‌లో అనేకం నష్టపోవడంతో పాటు మానసికంగా కుంగిపోతారు. అయినప్పటికీ వేతనాలు చాలనట్టుగా.. టేబులు కింద చేయి చాస్తూ... కడుపుమండిన వినియోగదారుడి ఒక్క ఫిర్యాదుతో జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు.
లంచం అడిగితే సమాచారం ఇవ్వండి
ప్రభుత్వ శాఖల్లో అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది లంచం డిమాండ్ చేస్తే తమకు సమాచారం అందించాలి. టోల్ ఫ్రీ నంబర్ 1064, ఫోన్ నంబర్ 91543 88912కు సమాచారం చేరవేయాలి. పనుల కోసం వెళ్లే ఎవరైన సరే ఒక్కపైసా లంచం రూపంలో ఇవ్వొద్దు. పైసలు డిమాండ్ చేసే సమయంలో వారి వివరాలను తమకు తెలియజేస్తే రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటాం.
– సాంబయ్య, డీఎస్‌పీ, ఏసీబీ,
ఉమ్మడి వరంగల్ జిల్లా
జిల్లాలో ఏసీబీకి పట్టుబడిన కొందరు అధికారులు