
రామయ్య పెళ్లికి రారండోయ్
నేడు సీతారాముల కల్యాణం
జిల్లా కేంద్రం, జీడికల్, వల్మిడి తదితర ఆలయాల్లో ఏర్పాట్లు పూర్తి
జనగామ/పాలకుర్తి టౌన్: జగదభిరాముడి కల్యాణా నికి సర్వం సిద్ధమైంది. ఆదివారం(నేడు) నిర్వహించే సీతారాముల పరిణయ వేడుకను పురస్కరించుకుని జిల్లాలోని ఆలయాలను ముస్తాబు చేశారు. పట్టణంలోని పాతబీటు బజారు పందిరి వద్ద 72వసారి స్వామి వారి కల్యాణ మహోత్సవం నిర్వహిస్తుండగా.. లింగాలఘణపురం మండలం జీడికల్ శ్రీసీతారామచంద్రస్వామి, పాలకుర్తి మండలం వల్మిడి ఆలయంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఆలయాల్లో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. శ్రీరామ నవమిని పురస్కరించుకుని ఆలయాలు, మండపాల వద్ద నిత్యపూజలు, అన్నదా న కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. రాములోరి కల్యాణానికి తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం ఆలయా ల వద్ద చలువ పందిళ్లను ఏర్పాటు చేశారు. మజ్జిక, తాగునీటి సౌకర్యం కల్పిస్తున్నారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పోలీసులు బందోబస్తు చేపట్టనున్నారు. ఇదిలా ఉండగా స్వామివారి కల్యాణ వేడుకలకు ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కడియం శ్రీహరి, యశస్వినిరెడ్డి, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. వల్మిడి ఆలయంలో కల్యాణోత్సవానికి వచ్చే భక్తుల వాహనా ల పార్కింగ్ ఏర్పాట్లను జనగామ వెస్ట్‌జోన్ డీసీపీ రాజమహేంద్రనాయక్ శనివారం పరిశీలించారు.