
తాటి ముంజలొచ్చాయ్..
● పోషక విలువలు కలిగిన ప్రకృతి ప్రసాదం
జనగామ: అత్యధిక పోషక విలువలు కలిగిన తాటి ముంజల సీజన్ వచ్చేసింది. అలసట నుంచి ఉపశమనం కలిగించి ఆరోగ్యాన్నిచ్చే ముంజ లంటే ప్రతిఒక్కరికీ ఇష్టమే. జిల్లాతోపాటు యాదాద్రి భువనగిరిలోని అనేక ప్రాంతాల నుంచి జనగామ పట్టణానికి తీసుకువచ్చి అండర్ రైల్వేబ్రిడ్జి, నెహ్రూపార్కు ఏరియాల్లో విక్రయిస్తున్నారు. పెరిగిన వేసవి ఎండల తీవ్రతనుంచి ఉపశమనం పొందడానికి ప్రజలు ముంజలను కొనుగోలు చేస్తుండడంతో డిమాండ్ పెరిగింది. డజనుకు రూ.60 చొప్పున అమ్ముతున్నారు. ప్రకృతి ప్రసాదించిన ఈ ముంజలు గతంలో ఊళ్లలో ఉచితంగా లభించేవి. ఇప్పుడు ధరలు పెరిగిపోవడంతో సామాన్య, మధ్యతరగతి వర్గాలకు కాస్త భారంగా మారింది.
పోషకాలు అధికం
తాటి ముంజల్లో అనేక పోషకాలున్నాయి. ఉష్ణతాపాన్ని తట్టుకునే శక్తి ఉంటుంది. డీ హైడ్రేషన్‌కు గురికాకుండా శరీరానికి అవసరమైన నీటి శాతాన్ని అందించడంతో పాటు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా కాపాడతాయి. క్యాల్షియం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం, ఐరన్, సల్ఫర్, కాపర్ పుష్కలంగా ఉంటాయి. రక్తహీనతను తగ్గించడం.. మలబద్ధకాన్ని దూరం చేస్తాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.

తాటి ముంజలొచ్చాయ్..