
సన్నబియ్యం పంపిణీ విప్లవాత్మకం
స్టేషన్‌ఘన్‌పూర్: దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి పేదలకు రేషన్‌షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ పథకం చేపట్టడం విప్లవాత్మకమైన నిర్ణయమని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఎస్సీకాలనీలో రేషన్‌బియ్యం లబ్ధిదారురాలు తాటికొండ యాదమ్మ ఇంటిలో వండిన భోజనాన్ని ఎమ్మెల్యేతో పాటు కలెక్టర్ రిజ్వాన్‌బాషా, అదనపు కలెక్టర్ రోహిత్‌సింగ్ తదితరులు సహఫంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీమంతులు తినే సన్నబియ్యాన్ని పేదలకు అందిస్తున్న ఘనత సీఎం రేవంత్‌రెడ్డిదే అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సన్నబియ్యం పంపిణీ పథకం పేదల ఆత్మగౌరవ పథకమన్నారు. సన్నరకం వరిధాన్యం ఎక్కువగా సాగుచేసేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, ఈ దిశగానే సన్నరకం పండించిన వారికి క్వింటాకు రూ.500 బోనస్ చెల్లిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్‌పర్సన్ జూలుకుంట్ల లావణ్యశిరీష్‌రెడ్డి, ఆర్‌డీఓ డీఎస్ వెంకన్న, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఆర్‌ఐ శ్రీకాంత్, నాయకులు సీహెచ్.నరేందర్‌రెడ్డి, సింగపురం వెంకటయ్య, చింత ఎల్లయ్య, చింత జాకబ్, తాటికొండ యాదగిరి, సన్నీ తదితరులు పాల్గొన్నారు.
పోషణ పక్షోత్సవాలను
విజయవంతం చేయాలి
ప్రతి అంగన్‌వాడీ కేంద్రంలో పోషణ్ అభియాన్ కింద చేపట్టే పోషణ పక్షం 2025 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో మహిళలు, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్‌తో కలిసి ఐసీడీఎస్ సూపర్‌వైజర్‌లు, సీడీపీఓలకు పోషణ్ అభియాన్–పోషణ పక్షం కార్యకమంపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు ఈ నెల 22 వరకు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల పౌష్టికాహారంపై అవగాహన కల్పించాలన్నారు. అనంతరం వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ఫ్లోరెన్స్, డీఏఓ రామారావు నాయక్, డీఎస్సీడీఓ విక్రమ్, డీఎంహెచ్‌ఓ మల్లిఖార్జున్ రావు, డీఈఓ రమేష్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ శ్రీదేవి, ప్రోగ్రామింగ్ అధికారి రవీందర్, పోషణ్ అభియాన్ జిల్లా కో–ఆర్డినేటర్ రాజశేఖర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కడియం శ్రీహరి
స్టేషన్‌ఘన్‌పూర్‌లో లబ్ధిదారుడి ఇంటిలో భోజనం చేసిన ఎమ్మెల్యే, కలెక్టర్