
జీపీ కార్మికుడికి ప్రభుత్వమే వైద్యం అందించాలి
సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాజు
రఘునాథపల్లి: విద్యుదాఘాతానికి గురై తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మండలంలోని మేకలగట్టు పంచాయతీ కార్మికుడు వేల్పుల నాగరాజుకు ప్రభుత్వమే పూర్తి వైద్య ఖర్చులు భరించి మెరుగైన వైద్యం అందించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాపర్తి రాజు డిమాండ్ చేశారు. ఈ నెల 5వ తేదీన గ్రామంలో వీధిలైట్లు వేస్తూ నాగరాజు విద్యుదాఘాతానికి గురై తీవ్ర గాయాలతో హనుమకొండ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా అధికారులు పట్టించుకోక పోవడాన్ని నిరసిస్తూ మండలంలోని పంచాయతీ కార్మికులు గురువారం ఎంపీడీఓ కార్యాలయం ముందు భైఠాయించి ధర్నా చేశారు. ఈ సందర్బంగా రాజు మాట్లాడుతూ మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దు చేసి పంచాయతీ కార్మికులకు ఉద్యోగ భద్రత, ప్రమాద బీమా, ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. అప్పులు చేసి వైద్యం చేయించుకుంటున్న నాగరాజుకు ప్రభుత్వం వైద్య సేవలు అందించకుంటే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ శ్రీనివాసులుకు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందించారు. కార్యక్రమంలో ఉమ్మగోని రాజేష్‌గౌడ్, మహేందర్, రాపోలు రాజ్‌కుమార్, సత్యనారాయణ, కొయ్యడ బిక్షపతి, నల్ల రాజన్న, ఎండీ అజ్మత్, ప్రభాకర్, నీలం మధు, యాదలక్ష్మి, రేణుక పాల్గొన్నారు.