
ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేయాలి
● టీటీఐఎఫ్ ప్రధాన కార్యదర్శి మంజుల
పాలకుర్తి టౌన్: సచివాలయం ఎదుట వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేయాలని తెలంగాణ తల్లి ఐలమ్మ ఫౌండేషన్ (టీటీఐఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్యాల మంజుల కోరారు. ఆదివారం మండలకేంద్రంలోని తెలంగాణ తల్లి ఐలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఐలమ్మ వారసులతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంజుల మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని, చాకలి ఐలమ్మ పేరిట మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. ఐలమ్మ వారసులు కడు దయనీయ స్థితిలో ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నారని, వారి సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేయాలన్నారు. జిల్లాకు ఐలమ్మ పేరు పెట్టాలని, పాలకుర్తిలో ఐలమ్మ స్మారక పార్కు నిమిత్తం ఐదు ఎకరాల భూమిని కేటాయించాలని కోరారు. త్వరలోనే ఐలమ్మ వారసుడు చిట్యాల జంపయ్య నేతృత్వంలో పాలకుర్తి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఐలమ్మ కుటుంబ సభ్యులు చిట్యాల యాకయ్య, రమేశ్, సంపత్, రాజశేఖర్, పంతగి రాజు, చిట్యాల మంజుల, లింగమ్మ, గట్టమ్మ, వెంకటమ్మ, భారతమ్మ, సంధ్యారాణి, అండాలు తదితరులు పాల్గొన్నారు.