
వైద్య సేవలను వినియోగించుకోవాలి
● జిల్లా వ్యవసాయ అధికారి రామారావునాయక్
బచ్చన్నపేట : గ్రామీణ ప్రాంత ఆస్పత్రుల్లో ఉచితంగా అందించే వైద్య సేవలను ప్రజలు వినియోగించుకోవా లని జిల్లా వ్యవసాయ అధికారి రామారావునాయక్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని జీపీ కార్యాలయంలో మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఆధ్వర్యాన నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరంలో ఆయన మాట్లాడారు. ఉచిత వైద్య శిబిరాలు పేదలకు వరం లాంటివని, వృద్ధులు, చేతకాని వారు కూడా దూర ప్రాంతాల్లో ఉన్న ఆస్పత్రులకు వెళ్లకుండా అందుబాటులో ఉన్న శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటమల్లికార్జున్, పంచాయతీ కార్యదర్శి నర్సింహచారి, నాయకులు నల్లగోని బాలకిషన్‌గౌడ్, గుర్రపు బాల్‌రాజు, అల్వాల రమేశ్ తదితరులు పాల్గొన్నారు.