
విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి
● ఎన్పీడీసీఎల్ డీఈ రాంబాబు
స్టేషన్‌ఘన్‌పూర్: విధుల నిర్వహణలో విద్యుత్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎన్పీడీసీఎల్ స్టేషన్‌ఘన్‌పూర్ డీఈ వై.రాంబాబు అన్నారు. స్థానిక సబ్‌స్టేషన్‌లో విద్యుత్ సిబ్బంది చేపట్టిన పనులను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యుత్ లైన్‌లో పనిచేస్తున్న సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని, లైన్ క్లియర్ తీసుకున్నప్పటికీ ఎర్త్ కట్టెలు వాడాలని చెప్పారు. ప్రస్తుత సీజన్‌లో విద్యుత్ లైన్లు తెగి ఇతర లైన్లపై పడి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయని, అప్రమత్తతే విద్యుత్ సిబ్బందికి శ్రీరామరక్ష అన్నారు.
ప్రజలకు మెరుగైన సేవలందించాలి●
● డీపీఓ స్వరూపరాణి
తరిగొప్పుల: ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా పంచాయతీ అధికారి నాగపురి స్వరూపరాణి అన్నారు. అంకుషాపూర్ గ్రామపంచాయతీని ఆమె బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా రికార్డుల నిర్వహణ, పన్నుల వసూలు, ఎస్టీఓలో నిధుల జమ తదితరాల విషయాలపై పంచాయతీ కార్యదర్శి అమనగంటి మహేందర్‌కు సూచనలు చేశారు. అనంతరం అంగన్వాడీ సెంటర్‌లో కొనసాగుతున్న పోషణ పక్షం కార్యక్రమంలో పాల్గొని మాతా శిశు సంరక్షణపై అవగాహన కల్పించారు. బలవర్థకమైన ఆహారం తీసుకునేలా జాగ్రత్తలు పాటించాలని, పచ్చదనం, పరిశుభ్రతపై ప్రత్యేక చొరవ చూపించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీఓ మాలతి, అంగన్‌వాడీ టీచర్ రాధ పాల్గొన్నారు.
తాగునీటి ఎద్దడి రానివ్వద్దు
నర్మెట: తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి నాగపురి స్వరూపారాణి అన్నారు. నర్మెట జీపీని సందర్శించిన ఆమె రికార్డులను పరిశీలించి కార్యదర్శి కందకట్ల శ్రీధర్‌కు పలు సూచనలు చేశారు. పన్నులు వంద శాతం వసూలు చేయడంతో పాటు పారిశద్ధ్యంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, తాగునీటి ట్యాంకులను క్లోరినేషన్ చేయించాలని సూచించారు. అనంతరం చౌరస్తాలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఆమె వెంట ఎంపీడీఓ బోడపాటి అరవింద్ చౌదరి, తరిగొప్పుల ఎంపీఓ ఎం.మాలతి, కార్యదర్శులు వంశి, యాకూబ్, గణేష్, అనిల్, శ్రీకాంత్, లింగం తదితరులు పాల్గొన్నారు.