
గురువారం శ్రీ 17 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
జనగామ: భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. అప్పుడే ఎండలు మే నెలను తలపిస్తున్నాయి. ఉదయం 8 గంటలు దాటిందంటే ఒంట్లో నుంచి చెమటలు ఉబికి వస్తున్నాయి. రోజువారీ కూలీ పనులకు వెళ్లే కార్మికులు, చిరు వ్యాపారులు తల్లడిల్లి పోతున్నారు. ఇక ఇళ్లలో ఉండే ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. వృద్ధులు, చిన్న పిల్లలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఎండల తీవ్రత పెరగడంతో ప్రజలు ఉక్కపోత, వేడి గాలుల కారణంగా డీ హైడ్రేషన్‌కు గురవుతున్నారు. ఇళ్లలో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు వినియోగిస్తున్నా వేడి గాలి తప్ప ఉపశమనం లభించడంలేదు. ఉష్ణోగ్రతలు అకస్మాత్తుగా పెరుగుతుండడంతో పరిస్థితులు ఇప్పుడే ఇలా ఉంటే మున్ముందు ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు.
జిల్లాలో బుధవారం ఉదయం 11.30 గంటలకు 32 డిగ్రీల సెల్సీఎస్ టెంపరేచర్ నమోదు కాగా.. మధ్యాహ్నం 3 గంటల వరకు 40 డిగ్రీలు దాటి పోయింది. అధిక వేడితో జనం అల్లాడి పోయారు. జిల్లాలో ఒక శాతం మాత్రమే అటవీ సంపద ఉండ డం.. ఉన్న పచ్చదనం కాస్త కనుమరుగైపోతున్న నేపథ్యంలో ప్రజలు నీడపట్టున ఉపశ మనం పొందలేని పరిస్థితి నెలకొంది. రోడ్ల విస్తరణ పేరుతో దశాబ్దాల నాటి మహావృక్షాలను తొలగించడం.. కొత్తగా నాటిన మొక్కల సంరక్షణ బాధ్యతను గాలికి వదిలేయడంతో వాతావరణ అసమతుల్యత కు కారణమవుతోంది.
వాతావరణంలో విచిత్ర పరిస్థితులు నెలకొంటున్నాయి. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంట ల వరకు ఎండలు నిప్పుల కొలిమిని తలపిస్తున్న తరుణంలో ఈదురు గాలులతో కూడిన వర్షాలు, వడగళ్లు కురిసి ఒక్కసారి గా వాతావరణం చల్లబ డుతోంది. రాత్రి తేమగా ఉంటూ.. తెల్లారే సరికి అగ్నిగుండంలా మారిపోతోంది. గంటల వ్యవధిలోనే వాతావరణంలో మార్పుల చోటుచేసు కోవడం ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. ఎండ వేడి నుంచి ఉపశమనం పొందడానికి యువకులు, విద్యార్థులు బావులు, ఈత కొలనుల్లో సేద దీరుతున్నారు. కొందరు శీతల పానీయాలు, కొబ్బరి బొండాలతో కాస్త చల్లబడుతున్నారు.
● పొద్దంతా ఎండవేడితో మంట
● సాయంకాలం ఈదురు గాలులు
● ప్రజలకు చెమటలు.. అన్నదాతలకు ముచ్చెమటలు
● విచిత్ర వాతావరణంతో
పెరుగుతున్న అనారోగ్య బాధితులు
పొద్దంతా ఎండ మంట..

గురువారం శ్రీ 17 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025