
ఉగ్ర చర్యపై ఆగ్రహం
● పహెల్గాం మృతులకు ఘన నివాళి
● కొవ్వొత్తులు, కాగడాలతో భారీ ర్యాలీ
జనగామ/జనగామ రూరల్: జమ్మూకశ్మీర్ పహెల్గాంలో హిందువులపై జరిగిన ఉగ్ర దాడిపై ఆగ్రహం పెల్లుబికింది. బీజేపీ, వీహెచ్‌పీ ఆధ్వర్యాన బుధవారం జిల్లా కేంద్రంలో ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దహనం చేయడంతోపాటు మృతులకు నివాళులర్పి స్తూ నెహ్రూ పార్కునుంచి ఆర్టీసీ చౌరస్తా శివాజీ విగ్రహం వరకు కొవ్వొత్తులు, కాగడాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి మోహనకృష్ణ భార్గవ మాట్లాడుతూ.. మారణకాండను యావత్ సమాజం ఖండించాలని పిలుపునిచ్చారు. జిహాదీ తీవ్ర వాదం నశించాలి.. ఉగ్రవాద సంస్థలను మట్టుబెట్టాలని నినాదాలు చేశారు. అనంతరం మోహనకృష్ణ భార్గవ మాట్లాడుతూ హిందువులను హతమార్చడమే ధ్యేయంగా ఉగ్రసంస్థలు పని చేస్తున్నాయని, పహెల్గామ్‌లో దారుణ మారణకాండకు పాల్పడిన ఉగ్రవాదులను మట్టుబెట్టడమే మృతులకు నిజమైన నివాళి అన్నారు. వేర్వేరుగా నిర్వహించిన ఆయా కార్యక్రమాల్లో మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తాటికుమార్, ప్రముఖ వైద్యులు కల్నల్ భిక్షపతి, వీహెచ్‌పీ ఉపాధ్యక్షులు పాశం శ్రీశైలం, బచ్చు బాలనారాయణ, పట్టణ అధ్యక్షుడు అంబటి బాలరాజు, బైరునాథ్, బొమ్మగాని అనిల్‌కుమార్, సుంచు శ్రీకాంత్ తదితరులతోపాటు బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్, మాజీ అధ్యక్షుడు దశమంతరెడ్డి, ఉడుగుల రమేశ్, పెరుమాళ్ల వెంకటేష్, శివరాజ్‌యాదవ్, శశిధర్‌రెడ్డి, అంజిరెడ్డి, అనిల్ పలువు రు, భజరంగ్‌దళ్, హిందూవాహిని, అనుబంధ సంఘాల బాధ్యులు పాల్గొన్నారు.