సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు చేయాలి
ములుగు రూరల్: పత్తి పంటను సీసీఐ ద్వారా కొనుగోలు చేసి క్వింటాకు రూ.25వేలు ధర చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి.అమ్జద్‌పాషా అన్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో మంత్రి సీతక్కకు ఆయన ఆదివారం వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో సుమారు 20వేల ఎకరాల్లో పత్తి పంటసాగు అయిందని తెలిపారు. సీసీఐ రెండు నెలలుగా కొనుగోలు చేసి వారం నుంచి కొనుగోళ్లు చేయడం లేదని తెలిపారు. దీంతో దళారులకు పత్తి అమ్ముకొని రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీసీఐ ద్వారా వెంటనే కొనుగోళ్లు పునరుద్ధరించి రైతుల వద్ద ఉన్న పత్తిని కొనుగోలు చేయాలని ఆయన కోరారు. అదే విధంగా జిల్లాలో సాగైన మిర్చిని మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసి క్వింటాకు రూ.25వేలు చెల్లించాలన్నారు. ములుగు ప్రాంతంలో శీతల గిడ్డంగులను ఏర్పాటు చేయాలని మంత్రిని కోరినట్లు తెలిపారు. మంత్రిని కిలిసిన వారిలో రైతుసంఘం నాయకులు బోడ రమేష్, గొంది సాంబయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment