శివరాత్రికి ప్రత్యేక బస్సులు
భూపాలపల్లి అర్బన్: మహాశివరాత్రిని పురస్కరించుకుని కాళేశ్వరానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపించనున్నట్లు భూపాలపల్లి ఆర్టీసీ డిపో మేనేజర్ ఇందు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 25 నుంచి 27వ తేదీ వరకు హనుమకొండ, భూపాలపల్లి నుంచి ప్రత్యేక బస్సులను నడిపిస్తున్నట్లు పేర్కొన్నారు. బస్సుల వివరాల కోసం 73828 54256 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.
అసత్య ఆరోపణలు
వెనక్కి తీసుకోవాలి..
భూపాలపల్లి అర్బన్: సీఎంపీఎఫ్ అక్రమాలపై బీఎంఎస్ నాయకులు చేసిన అసత్య ఆరోపణలు వెనక్కి తీసుకోవాలని ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పసునూటి రాజేందర్ డిమాండ్ చేశారు. ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2015 సంవత్సరంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉందని ఆసమయంలో సీఎంపీఎఫ్ అక్రమాలు జరిగినట్లు తెలిపారు. అవగా హన లేకుండా యూపీఏ హయంలో అక్రమాలు జరిగాయని బీఎంఎస్ నాయకులు ఆరోపణలు చేయడం తగదన్నారు. కార్మికుల పక్షాన ఐఎన్టీయూసీ నిరంతరం పని చేస్తుందని కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగతామని హెచ్చరించారు. సమావేశంలో నాయకులు సిరంగి రాజయ్య, రమేశ్, రవికిరణ్, కృష్ణ, కుమార్ పాల్గొన్నారు.
గొత్తికోయలను మోసం చేసిన అటవీశాఖ అధికారి
ఏటూరునాగారం: గొత్తికోయల భూమిని వేరొకరి వద్ద డబ్బులు తీసుకుని వారిపేరు ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాకు ఎక్కించి పోడు భూముల సర్వే బీట్ ఆఫీసర్ మోసం చేశారని రాయిబంధం గ్రామ పెద్దలు పథం జోగయ్య, కిశోర్, వడ్కాపురం సారయ్య ఆరోపించారు. మండల కేంద్రంలో ఆదివారం గ్రామ పెద్దలు, బాధితులు విలేకరులకు వెల్లడించారు. మండలంలోని చిన్నబోయినపల్లి పరిధిలో గల రాయిబంధం గ్రామ శివారులో 25 ఏళ్లుగా కాస్తులో పథం పొజ్జయ్య, మడకం సమ్మయ్య, కత్మా గంగయ్య తమకున్న నాలుగెకరాల భూమిని సాగుచేసుకుంటున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో 2023లో పోడు భూముల సర్వే బీట్ ఆఫీసర్ రాజేశ్ పెద్ద వెంకటాపురం గ్రామానికి చెందిన గిరిజన మహిళ కబ్బాక నీలమ్మ వద్ద డబ్బులు తీసుకుని గొత్తికోయలకు చెందిన భూమిని ఆమె పేరుపై ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాకు ఎక్కించారని ఆరోపించారు. దీనిపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టి బాధిత రైతులకు న్యాయం చేయాలని వారు కోరారు.
ముగిసిన ‘ఇంటర్ నిట్’ టోర్నమెంట్స్
కాజీపేట అర్బన్: వరంగల్ నిట్‌లో వాలీబాల్, హ్యాండ్‌బాల్, యోగా క్రీడల ‘ఇంటర్ నిట్’ పోటీలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా విజేతలకు నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుదీ బహుమతులు ప్రదానం చేసి అభినందించారు. క్రీడలు వ్యక్తిత్వ వికాసానికి, క్రమశిక్షణ దోహదం చేస్తాయన్నారు. కార్యక్రమంలో డీన్ స్టూడెంట్స్ వెల్ఫేర్ ప్రొఫెసర్ శ్రీనివాసాచార్య, హెడ్ సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఆక్టివిటీస్ ప్రొఫెసర్ రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.
పంచ పరివర్తనతోనే సమాజ కల్యాణం
కేయూ క్యాంపస్: పంచ పరివర్తనతోనే సమాజ కల్యాణం జరగుతుంది.. వ్యక్తి నిర్మాణం ఆధారంగానే వ్యవస్థలో మార్పు వస్తుందని ఆర్‌ఎస్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి కాచం రమేశ్ అన్నారు. ఆదివారం హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానంలో వరంగల్ మహానగరంలోని ఆర్‌ఎస్‌ఎస్ 100 శాఖల నుంచి స్వయం సేవకులతో ‘మహానగర సాంఘిక్’ కార్యక్రమం నిర్వహించారు. తొలుత సూర్య నమస్కారాలు, యోగా, వ్యాయామం తర్వాత రమేశ్ మాట్లాడారు. స్వదేశీ, సామరస్యత, పర్యావరణ పరిరక్షణ తదితర విషయాల్లో ప్రతి ఒక్కరిలో మార్పు రావాలన్నారు.
శివరాత్రికి ప్రత్యేక బస్సులు
Comments
Please login to add a commentAdd a comment