కోల్‌బెల్ట్‌లో మరింత తీవ్రత..
భూపాలపల్లి అర్బన్: వేసవి ప్రారంభంలోనే జిల్లాలో ఎండలు తీవ్రమయ్యాయి. శీతాకాలం ముగియకముందే 20 రోజులుగా ఉష్ణోగ్రతల్లో భారీగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. జనవరి చివరి వరకు రికార్డు స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో తీవ్రమైన చలి కనిపించింది. వేసవి ప్రారంభం కావడంతో ముదురుతున్న ఎండలకు జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఆదివారం జిల్లాలో పగటి గరిష్ట ఉష్ణోగ్రతలు 37 డిగ్రీలు కాగా.. కనిష్ట ఉష్ణోగ్రతలు 17.2 డిగ్రీలుగా నమోదయ్యాయి. గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతల్లో భారీ తేడాలు కనిపిస్తున్నాయి. గతేడాది వేసవిలో అత్యధికంగా 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు సమోదయ్యాయి. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే ఏప్రిల్, మే నెలలో పరిస్థితి ఎలా ఉంటుందోనని జనం బెంబేలెత్తుతున్నారు.
‘సీజనల్’ సందడి..
వేసవి సీజన్ ప్రారంభం కావడంతో సీజనల్ వ్యాపారాలు ఊపందుకుంటున్నాయి. శీతల పానీయాల కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. కూలర్లు, ఏసీల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ఇన్నాళ్లు చలి తీవ్రతకు పక్కన పెట్టిన కూలర్లు, ఏసీలకు మరమ్మతులు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి ముందు పందిళ్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. రైతులు వేసవిలో తీసుకునే జాగ్రత్తలు, పండించే పంటలపై దృష్టి సారిస్తున్నారు.
అడుగంటిపోతున్న జల వనరులు
ముదురుతున్న ఎండలతో నీటి వనరులు అడుగంటిపోతున్నాయి. ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లో నీటిమట్టం తగ్గుముఖం పడుతోంది. వాగులు, వంకలు, ఒర్రెల్లో నీళ్లు ఆవిరవుతున్నాయి. దీంతో మూగజీవాలు దాహంతో అల్లాడుతున్నాయి. వన్యప్రాణులు నీటి జాడ కోసం అడవులను వదిలి మైదాన ప్రాంతాలకు తరలివస్తున్నాయి. వాగులు, ఒర్రెలపై ఆధారపడి యాసంగిలో పంటలను సాగు చేస్తున్న రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రత్యామ్నాయ మార్గాల్లో పంటలను రక్షించుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో కూరగాయల ధరలు సైతం మండిపోతున్నాయి. వాతావరణంలో మార్పుల కారణంగా ప్రజలు సీజనల్ వ్యాధుల బారినపడుతున్నారు.
జాగ్రత్తలు పాటించాలి..
ఈ ఏడాది ఎండ తీవ్రత అధికంగా ఉండనుంది. అత్యవసరమైతే తప్ప ఎండకు బయటకు వెళ్లవద్దు. వెళ్లాల్సి వస్తే తగు జాగ్రత్తలు తీసు కోవాలి. ఎక్కువగా ద్రవ పదార్థాలు తీసుకోవాలి. – మధుసూదన్, డీఎంహెచ్‌ఓ
ఉక్కపోత భరించలేకపోతున్నాం..
ఎండలు విపరీతంగా పెరిగాయి. మధ్యాహ్నం, రాత్రి వేళల్లో భరించలేని ఉక్కపోత ఉంటోంది. ఎండ తీవ్రత కారణంగా కూలర్లు, ఫ్యాన్లు అధికంగా వినియోగించాల్సి వస్తోంది. కరెంట్ బిల్లులు పెరిగిపోతున్నాయి.
– టి.రవీందర్, వ్యాపారి, భూపాలపల్లి
గొడుగులతో వస్తున్న మెడికల్ కళాశాల విద్యార్థులు
భూపాలపల్లి, గణపురం మండలాల్లో సింగరేణి గనులు, కేటీపీపీ ఉండడంతో ఎండ తీవ్రత అధికంగా ఉంటోంది. ఓపెన్‌కాస్ట్టులు, కేటీపీపీలతో ఈ ప్రాంతాల్లో ఇప్పటి నుంచే పగటి పూట వేడి గాలులు వీస్తున్నాయి. మరో మూడు నెలల్లో ఉష్ణోగ్రతలు పెరిగితే ఎలాంటి ఇబ్బందులు పడాల్సి వస్తుందోనని ఇక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓపెన్ కాస్ట్, కేటీపీపీలో పని చేసే కార్మికులు, ఉద్యోగులు వేడి తీవ్రతతో ఇబ్బందులు పడుతున్నారు. యాజమాన్యాలు ఉక్కపోతకు ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడం లేదని, తక్షణమే చర్యలు చేపట్టాలని కార్మికులు, ఉద్యోగులు కోరుతున్నారు.
కోల్‌బెల్ట్‌లో మరింత తీవ్రత..
Comments
Please login to add a commentAdd a comment