పోడు రైతులపై దాడి అమానుషం
భూపాలపల్లి రూరల్: భూపాలపల్లి మండలం ఆజాంనగర్ గ్రామశివారులో పోడు చేసుకుంటున్న రైతులపై అటవీశాఖ అధికారులు మూకుమ్మడిగా దాడి చేయడం అమానుషమని, ఈఘటనను ఖండిస్తున్నట్లు మానవ హక్కుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్.తిరుపతయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాదావత్ రాజు అన్నారు. ఆదివారం ఆజాంనగర్‌లో దాడి జరిగిన ప్రదేశాన్ని మానవహక్కుల బృందం నాయకులు పరిశీలించారు. బాధిత రైతులను పరామర్శించి వివరాలు అడిగి తెలిసుకున్నారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. అక్కడ సాగు చేసుకుంటున్న కుటుంబాల్లో అందరూ గుంట భూమి లేని దళిత రైతులేనని, వారు గత 35 ఏళ్లుగా పోడు వ్యవసాయం చేస్తున్నారన్నారు. రెండేళ్లుగా డీఆర్‌ఓగా పనిచేస్తున్న అధికారిణి సుమారు 30 ఎకరాల పోడు భూమిలో పత్తి సాగు చేయడానికి గత సంవత్సరంలో రూ. 5 లక్షల రూపాయలను తీసుకున్నారని, ఈఏడాది మరో రెండు లక్షల రూపాయలు అడగ్గా, రైతులు ఇవ్వకపోవడంతోనే గత గురువారం అధికారులు, పోలీసులతో వచ్చి దాడికి పా ల్పడ్డారని ఆరోపించారు. అడ్డగించిన రైతులను కిందపడేసి అధికారులు బూట్లతో తన్ని, తొక్కి లాఠీలతో విచక్షణారహితంగా కొట్టినట్లు పేర్కొన్నారు. దాడి ఎంత మాత్రమూ సహించరానిదని, మానవీయ కోణంలో అత్యంత హేయమైన చర్యగా మానవ హక్కుల వేదిక భావిస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పోడు చేసుకుంటున్న భూములకు పట్టాలని ఇవ్వాలని.. దాడిలో గాయపడ్డ వారికి వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించాలని కోరారు. బాధిత కుటుంబాలకు తక్షణం రూ.1 లక్ష చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మానవ హక్కుల వేదిక బృందంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి హరికృష్ణ, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి దిలీప్, సభ్యులు హనుమాన్ ప్రసాద్, కర్ణాటక సమ్మయ్య, చంద్రగిరి శంకర్ తదితరులు పాల్గొన్నారు.
దాడి చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలి..
మానవ హక్కుల వేదిక నాయకులు
Comments
Please login to add a commentAdd a comment