సుద్ద ముక్కలతో శివలింగాలు
కాటారం: మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలుర గురుకుల కళాశాల ఆర్ట్ ఉపాధ్యాయుడు ఆడెపు రజనీకాంత్ సూక్ష్మ కళాకృతులను తయారు చేసి అబ్బురపరుస్తున్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని రజనీకాంత్ చాక్‌పీస్, పెన్సిల్ గ్రాఫైట్, క్యారెట్, బంగాళదుంపలతో శివలింగాలను తయారు చేసి ఆకట్టుకున్నారు. చాక్ పీస్‌లపై సెంటీమీటర్ ఎత్తు, సెంటీమీటర్ వెడల్పు ఉన్న సూక్ష్మమైన 109 శివలింగాలను రూపొందించారు. గుండు పిన్ను సహాయంతో పది గంటలు శ్రమించి ఈ శివలింగాలను తయారు చేసినట్లు రజనీకాంత్ తెలిపారు.
ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలి
భూపాలపల్లి అర్బన్: ఏరియాలోని కేటీకే 8వ గనిలో 2వ సీమ్ ప్రైవేటీకరణను యాజమాన్యం వెంటనే ఉపసంహరించుకోవాలని ఏఐటీయూసీ బ్రాంచీ కార్యదర్శి మోటపలుకుల రమేష్ డిమాండ్ చేశారు. ఏరియాలోని కేటీకే 8వ గనిలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మంగళవారం నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ.. నేడు(బుధవారం) అన్ని గనులు, డిపార్ట్‌మెంట్‌లలో నల్ల బ్యాడ్జీలు, మెమోరాండాలు అందజేసి నిరసన తెలియజేస్తున్నట్లు చెప్పారు. ప్రైవేటీకరణపై 27న జీఎం కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు, కార్మికులు కృష్ణారెడ్డి, వెంకటస్వామి, శీనుబాబు, రాజబాబు, మహేందర్, వీరయ్య, శ్రీనివాస్, శంకర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
కాళేశ్వరానికి ప్రత్యేక బస్సులు
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో జరుగు మహాశివరాత్రి ఉత్సవాలకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడిపిస్తున్నట్లు ఆర్టీసీ భూపాలపల్లి డీఎం ఇందు తెలిపారు. మంగళవారం కాళేశ్వరం బస్టాండ్ వద్ద తమ సిబ్బందితో కలిసి బస్సులను పర్యవేక్షించారు. భూపాలపల్లి నుంచి పలు ప్రాంతాలకు బస్సులు అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. భక్తులకు, ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా రెండు రోజుల పాటు రవాణా చేస్తామని తెలిపారు.
స్థానికుల దర్శనం ఉదయం 6నుంచి..
బుధవారం ఉదయం 6గంటల నుంచి 8గంటల వరకు స్వామివారి గర్భగుడిలో స్థానికులకు దర్శనానికి అవకాశం కల్పించినట్లు ఈఓ మహేష్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
మెరుగైన విద్యుత్ సరఫరా
భూపాలపల్లి రూరల్: జిల్లాలో వేసవికాలంలో నిరంతరం విద్యుత్ సరఫరా చేయనున్నట్లు ఎస్‌ఈ మల్చూర్ నాయక్ తెలిపారు. సమ్మర్ యాక్షన్ ప్లానింగ్‌లో భాగంగా మంగళవారం భూపాలపల్లి మండలంలోని చెల్పూర్, పెద్దాపూర్ గ్రామాల మధ్య కొత్తగా విద్యుత్ పోల్స్‌తో పాటు కొత్తగా విద్యుత్‌లైన్‌లు పొడిగించినట్లు తెలిపారు. ఎస్‌ఈ వెంట అధికారులు ఏడీఈ, ఏఈ ఉన్నారు.
రైతుల ఆందోళన
కాళేశ్వరం: ఇసుక లారీలతో ఇబ్బందులు పడుతున్నా టీజీఎండీసీ అధికారులు, పోలీసులు పట్టించుకోవడం లేదని రైతులు మంగళవారం ఆందోళన చేశారు. ఇసుక లారీ రోడ్డు పక్కన నిలుపడంతో బ్రాహ్మణపల్లికి కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ ప్రమాదానికి గురైంది. ఎలాంటి నష్టం జరగకపోయినా నిత్యం లారీలు రోడ్డుకు ఒక వైపు నిలిపి ఉండడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పంటపొలాలకు వెళ్తున్నామని రైతులు వాపోయారు. ట్రాఫిక్‌ను నియంత్రించాలని డిమాండ్ చేశారు. అనంతరం పోలీసులు చేరుకొని నచ్చచెప్పి విరమింపజేశారు.
సుద్ద ముక్కలతో శివలింగాలు
సుద్ద ముక్కలతో శివలింగాలు
Comments
Please login to add a commentAdd a comment