ఇటీవల చోటు చేసుకున్న ప్రమాదాలు..
● కాటారం మండలం ధన్వాడ సమీపంలోని మీనాక్షి జిన్నింగ్ మిల్లులో నిప్పుంటుకొని సుమారు రూ.కోటి విలువ చేసే పత్తి దగ్ధమైంది.
● గుమ్మాళ్లపల్లిలో వంట గ్యాస్ పేలి ఇల్లు దగ్ధమైంది. సుమారు రూ.6 లక్షల మేర నష్టం జరిగింది.
● కాటారం మండలం చల్లపల్లి సమీపంలోని రుద్ర జిన్నింగ్ మిల్లులో పత్తికి నిప్పుంటుకొని సుమారు రూ.15 లక్షల మేర నష్టం చోటుచేసుకుంది.
● మల్హర్ మండలం నాచారంలో జామాయిల్ తోటకు నిప్పు అంటుకోవడంతో దగ్ధమైంది.
● భూపాలపల్లి మండలం దూదేకులపల్లిలో రైతు పొలంలో ఆరబోసిన మిర్చికి నిప్పు అంటుకుని సుమారు రూ.3.50 లక్షల మేర నష్టం జరిగింది.
● చిట్యాల మండలం గిద్దెముత్తారంలో అయిల్‌పాం తోటకు నిప్పుంటుకొని కాలిపోయింది.
కాటారం: అసలే అటవీ గ్రామాలతో కూడిన జిల్లా.. నిత్యం ఎక్కడో ఒక చోట అగ్ని ప్రమాదం.. లక్షలాది రూపాయల ఆస్తినష్టం.. జిల్లావ్యాప్తంగా ఒకే ఒక్క ఫైర్‌స్టేషన్ ఉండటంతో అగ్నిమాపక సేవలు అస్తవ్యస్తంగా మారాయి. ఎక్కడైనా అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నప్పుడు జిల్లాకేంద్రం నుంచి ఫైర్ ఇంజన్ చేరుకునే లోపు ఆస్తులన్నీ బుగ్గిపాలవుతున్నాయి. జిల్లా ఏర్పడి ఏళ్లు దాటుతున్నా మరో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటుకు అడుగులు ముందుకు పడటం లేదు. ఇటీవల కాటారం సబ్ డివిజన్ పరిధిలోని మహదేవపూర్‌లో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడినప్పటికీ ఇంకా అటు ఆ దిశగా చర్యలు ప్రారంభం కాలేదు. ప్రతి ఏటా అగ్ని ప్రమాదాల సంఖ్య పెరుగుతూ ఉండటంతో ఒకేకేంద్రం నుంచి అగ్నిమాపక సేవలు సకాలంలో అందక బాధితులు తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. వేసవికాలం సమీపిస్తుండటంతో అగ్నిప్రమాదాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
చిన్న గది.. అరకొరగా సిబ్బంది..
జిల్లాకేంద్రంలో ఉన్న ఫైర్‌స్టేషన్‌కు సొంత భవనం లేక మున్సిపల్ కార్యాలయంలోని ఓ చిన్న భవనంలో కొనసాగుతుంది. జిల్లా అగ్నిమాపక శాఖలో సిబ్బంది కొరత సైతం నెలకొంది. అరకొర సిబ్బందితో కాలం వెల్లదీయాల్సిన పరిస్థితి నెలకొంది. సిబ్బంది కొరత కారణంగా ఉన్న సిబ్బందిపైనే పనిభారం అధికమవుతుంది. జిల్లా అగ్నిమాపక శాఖలో అధికారులు, సిబ్బంది కలిసి సుమారు 16మంది వరకు ఉండాల్సి ఉండగా 12మంది మాత్రమే కొనసాగుతున్నారు. డ్రైవర్ ఆపరేటర్లు ముగ్గురు ఉండాల్సి ఉండగా ఇద్దరు మాత్రమే పర్మనెంట్‌గా ఉన్నారు. ఫైర్‌మన్లు పదిమంది ఉండాల్సి ఉండగా ఆరుగురు విధులు నిర్వర్తిసున్నారు.
ఒక్కటే కేంద్రం..
జిల్లావ్యాప్తంగా ఒకే ఒక్క ఫైర్‌స్టేషన్, ఒక ఫైరింజన్ మాత్రమే ఉండటం జిల్లావాసులను తీవ్ర అసౌకర్యానికి గురిచేస్తుంది. జిల్లా పరిధిలో 12మండలాలు ఉండగా 241 గ్రామపంచాయతీలు ఉన్నాయి. మంథని నియోజకవర్గం పరిధిలోని కాటారం, మహదేవపూర్, మల్హర్, మహాముత్తారం, పలిమెల మండలాలు, భూపాలపల్లి నియోజకవర్గంలో భూపాలపల్లి, రేగొండ, కొత్తపల్లిగోరి, గణపురం, చిట్యాల, మొగుళ్లపల్లి, టేకుమట్ల మండలాలు జిల్లాలో ఉన్నాయి. ప్రతి మండలం జిల్లా నుంచి 50–70 కిలో మీటర్ల వ్యవధి దూరంలో ఉన్నాయి. ఎక్కడ అగ్ని ప్రమాదాలు జరిగిన జిల్లాకేంద్రంలోని ఫైర్‌స్టేషన్‌లో ఉన్న ఒక్క ఫైరింజన్ వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు సంభవిస్తే అక్కడి వరకు ఫైరింజన్ సకాలంలో చేరుకోలేకపోతుంది. దీంతో అప్పటికే ఆస్తులు అగ్నికి ఆహుతవుతున్నాయి. 30కిలోమీటర్లకు ఒక అగ్నిమాపక కేంద్రం ఉండాలనే నిబంధనలు ఉన్నా జిల్లాకేంద్రంలో తప్ప మరెక్కడా అగ్నిమాపక కేంద్రం లేకపోవడం అగ్నిప్రమాదాలు చోటు చేసుకొన్నప్పుడు ప్రజలకు మరింత నష్టం చేకూరుస్తుంది.
సమయానికి స్పందిస్తున్నాం..
జిల్లాలో అగ్నిప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు సమాచారం అందిన వెంటనే సమయానికి స్పందిస్తున్నాం. ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పుతున్నారు. అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమాలు, ప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు తగు సూచనలు చేస్తున్నాం. ఏదైనా అగ్ని ప్రమాదాలు సంభవించినపుడు 87126 99209 నెంబర్‌కు సమాచారం అందించండి.
– అడువాల శ్రీనివాస్, ఫైర్ ఆఫీసర్, భూపాలపల్లి
ఇటీవల చోటు చేసుకున్న ప్రమాదాలు..
Comments
Please login to add a commentAdd a comment