భూపాలపల్లి: నిర్ణీత సమయంలో సరస్వతీ పుష్కర పనులను పూర్తి చేయాలని, ఇందుకోసం డిస్ట్రిక్ట్ టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ రాహుల్ శర్మ వెల్లడించారు. సరస్వతీ పుష్కరాల ఏర్పాట్లపై గురువారం వివిధ శాఖల అధికారులతో ఐడీఓసీ కార్యాలయం నుంచి కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇరిగేషన్ అధికారులు వీఐపీ పుష్కర ఘాట్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. పుష్కర ఘాట్‌లో స్నానఘట్టాలు, బట్టలు మార్చుకునే గదులు, చలువ పందిళ్ల ఏర్పాటుతో పాటు గోదావరి తీరంలో తాత్కాలిక రోడ్డు నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్నారు. మిషన్ భగీరథ ద్వారా తాగునీటి ట్యాంకు నిర్మాణం, పైపులైను ఏర్పాటు, పార్కింగ్ స్థలాల వద్ద నీటి సౌకర్యం, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. దేవాదాయ శాఖ ద్వారా చేపట్టిన పనులను ఏప్రిల్ నెలాఖరు వరకు పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో ఎస్పీ కిరణ్ ఖరే, సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీపీఓ నారాయణరావు, సీపీఓ బాబురావు పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రాలు పెంచేలా చర్యలు..
ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రస్తుత యాసంగి సీజన్‌లో మహిళా సంఘాలకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెంచేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. సెర్ప్ కార్యక్రమాలపై సెర్ఫ్ సీఈఓ దివ్యతో కలిసి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి లోకేష్‌కుమార్ గురువారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్.. జిల్లా అధికారులతో సమావేశమై మాట్లాడారు. 2022–23 సంవత్సరానికి సంబంధించిన కమీషన్ పౌర సరఫరాల శాఖ వద్ద పెండింగ్ ఉన్న వివరాలు అందజేయాలన్నారు. గన్నీ బ్యాగులు రీ కన్సిలేషన్ ప్రక్రియ కూడా పూర్తి కావాల్సి ఉందని, త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీఆర్‌డీఓ నరేష్, ప్రధాన ఆస్పత్రి పర్యవేక్షకుడు డాక్టర్ నవీన్, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ రాములు పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్ శర్మ