భూపాలపల్లి రూరల్: రాజీవ్ యువ వికాస్ పథకం దరఖాస్తుల గడువును ఈనెల 14వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా అల్పా సంఖ్యాక వర్గాల అధికారిణి టి.శైలజ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని అల్ప సంఖ్యాక వర్గాల నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆన్‌లైన్, మున్సిపల్, ఎంపీడీఓ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరిస్తాం
మల్హర్: ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను 100 శాతం పరిష్కరించడానికి కృషి చేస్తానని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడి హామీనిచ్చారు. రుద్రారం గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలను మంగళవారం ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు లక్షణ్‌బాబు, ఉపాధ్యాయ బృందం ఆయనకు ఘన స్వాగతం పలికారు. శాలువాతో సత్కరించి, ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పాత పెన్షన్ వర్తింపు, పెండింగ్ బకాయిలు తదితర సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు సుభాకర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కిరణ్‌కుమార్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు విజయపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
సూరారం పాఠశాల
సమీపంలో క్షుద్రపూజలు
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం సూరారం జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాల సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు రోడ్డుపై క్షుద్రపూజలు చేశారు. మంగళవారం ఉదయం రోడ్డుపై ఎరుపు రంగు వస్త్రంలో కొబ్బరికాయ, కుంకుమ, నిమ్మకాయలు దర్శనమివ్వడంతో గ్రామస్తులతో పాటు విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు.
కోనంపేట సమీపంలో
పులి ప్రచారం
కాటారం: మహాముత్తారం మండలం కోనంపేట అటవీ ప్రాంతంలో పులి సంచరించినట్లు మంగళవారం ప్రచారం జరిగింది. అటవీ ప్రాంతంలోకి వెళ్లిన పలువురు పులి అడుగులను పోలిన గుర్తులను గమనించి గ్రామస్తులకు తెలిపారు. దీంతో పులి అడవిలో ఉందనే వార్త గ్రామం మొత్తం చుట్టేసింది. గ్రామస్తుల ద్వారా సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు అటవీ ప్రాంతానికి చేరుకొని పాదముద్రలను పరిశీలించారు. అవి పులి అడుగులు కావని పులిని పోలిన హైనా వంటి అటవీ జంతువు పాదముద్రలు అని రేంజ్ అధికారిణి ఉష తెలిపారు. ప్రజలు భయాందోళనకు గురికావద్దని సూచించారు.
గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించాలి
భూపాలపల్లి అర్బన్: పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఐ పట్టణ కార్యదర్శి సోత్కు ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. పెంచిన గ్యాస్ ధరలను నిరసిస్తూ మంగళవారం జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్‌లో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం వంట సిలిండర్ గ్యాస్ ధర రూ.50 పెంచడం దారుణమన్నారు. పేద ప్రజలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బందులు పడుతుంటే ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు ఇష్టానుసారంగా ధరలు పెంచుకుంటూ పోతున్నాయని మండిపడ్డారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక, రోజువారి కూలీ వేతనం పెరగక అనేక అవస్థలు పడుతుంటే బీజేపీ ప్రభుత్వం నిత్యవసర ధరలను పెంచుకుంటూ పేద ప్రజల నడ్డి విరుస్తుందన్నారు. పెంచిన ధరలను తగ్గించకపోతే సీపీఐ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళన పోరాటాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని ప్రవీణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు వేముల శ్రీకాంత్, నేరెళ్ల జోసెఫ్, అస్లాం, వైకుంఠం, హరీశ్, శివకృష్ణ, శేఖర్, లావణ్య, వనిత, సరూప పాల్గొన్నారు.
దరఖాస్తు గడువు పొడిగింపు
దరఖాస్తు గడువు పొడిగింపు
దరఖాస్తు గడువు పొడిగింపు