కారు కిరాయి.. ఇంధనం పరాయి | - | Sakshi
Sakshi News home page

కారు కిరాయి.. ఇంధనం పరాయి

Published Fri, Apr 18 2025 1:14 AM | Last Updated on Fri, Apr 18 2025 1:14 AM

కారు కిరాయి.. ఇంధనం పరాయి

కారు కిరాయి.. ఇంధనం పరాయి

సాక్షిప్రతినిధి, వరంగల్‌:

పరకాలలోని హుజూరాబాద్‌ రోడ్డులో గల ఓ పెట్రోల్‌బంకు. గత నెల 25న స్కై బ్లూ రంగు గల కియా కారులో బంకులోకి వచ్చిన ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు క్యాన్లలో రూ.7,500 (78.67 లీటర్ల) డీజిల్‌ పోయించుకున్నారు. డబ్బులు ఇమ్మని అడగ్గా ఫోన్‌ పే చేస్తామని స్కాన్‌ చేశారు. డబ్బులు రాలేదని చెప్పగా.. వస్తాయని చెప్పి కారులో ఉడాయించగా పెట్రోల్‌ బంక్‌ మేనేజర్‌ ఈ నెల 12న పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రాయపర్తిలో హెచ్‌పీ పెట్రోల్‌ బంకులోకి గత నెల 31న రాత్రి సుమారు 11.30 గంటల సమయంలో బ్లూ కలర్‌ బెలోనో కారు వెళ్లింది. అందులో ఉన్న ముగ్గురు వ్యక్తులు మూడు క్యాన్లతో డీజిల్‌ కొట్టించుకున్నారు. రూ.10,508 విలువైన 110.22 లీటర్ల డీజిల్‌ కొట్టించుకున్న సదరు వ్యక్తులు స్కానర్‌ ద్వారా పేమెంట్‌ చేసినట్లు చెప్పారు. డబ్బులు జమ కాలేదని చెప్పినా వినకుండా కారు స్టార్ట్‌ చేసుకుని వెళ్లారు. దీంతో ఆ బంకు క్యాషియర్‌ ఈ నెల 15న పోలీసులకు ఫిర్యాదు చేశారు.

... ఇలా సుమారు 25 రోజుల్లో సుమారు 25 బంకుల్లో డీజిల్‌, పెట్రోల్‌ దొంగిలించిన ఆకతా యిల వ్యవహారం వరంగల్‌ కమిషనరేట్‌ పోలీసులకు సవాల్‌గా మారింది. గత కొద్ది రోజులుగా ఆకతాయిలు కొందరు సెల్ఫ్‌ డ్రైవింగ్‌ వాహనాలను అద్దెకు తీసుకుని కారుతోపాటు క్యాన్‌లలో ఇంధనం తీసుకెళ్లి అమ్ముకుంటూ.. ఆ డబ్బుతో జల్సా చేయడం పరిపాటిగా మారింది. అత్యధికంగా పరకాల, దామెర, నడికూడ, రాయపర్తి, జఫర్‌గడ్‌, రేగొండ, నల్లబెల్లి మండలాల్లోని బంకుల్లో ఈ తరహా దందాలకు పాల్పడినట్లు ఫిర్యాదులు ఉన్నాయి. ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేసిన పరకాల, రాయపర్తి పోలీసులు నిందితుల కోసం ఆరా తీయగా.. ఇంధనం దొంగల గుట్టురట్టయ్యింది. కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. సుమారు 12 మంది వరకు పనీపాట లేని యువకులు మూడు టీములుగా ఏర్పడి ‘సెల్ఫ్‌ డ్రైవింగ్‌’ వాహనాలకు అద్దెకు తీసుకుని ఆ వాహనాల నంబర్‌ ప్లేట్లు తీసి పెట్రోల్‌ బంకుల్లో వెళ్లి ఇంధనం దొంగిలిస్తూ జల్సాలు చేస్తుండగా పోలీసులు వారి ఆటకట్టించినట్లు సమాచారం. మూడు టీములకు చెందిన సభ్యులను అరెస్టు చేసేందుకు సిద్ధమైన పోలీసులు అదుపులో ఉన్నవారినుంచి పూర్తి వివరాలు రాబడుతున్నట్లు సమాచారం. కాగా నేడో, రేపో నిందితులను అరెస్టు చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

స్కాన్‌ చేసినట్లు యాక్షన్‌..

ఇంధనం క్యాన్లతో పరార్‌

పెట్రోల్‌ బంకులకు బురిడీ

కొట్టించి జల్సాలు

మూడు బృందాలుగా ఆగడాలు.. పోలీసుల అదుపులో ఆకతాయిలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement