మెడికల్ కళాశాలలో వసతులు కల్పించాలి
గద్వాలటౌన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో మౌలిక సదుపాయాలు కల్పించడంతో ప్రభుత్వం విఫలమైందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి డీకే స్నిగ్ధారెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం బీజేపీ నాయకులు ప్రభుత్వ మెడికల్ కళాశాల పరిసరాలను పరిశీలించారు. అనంతరం వైద్యాధికారులు, విద్యార్థులతో మాట్లాడి, వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఆర్భాటంగా ప్రారంభించడంతో చూపిన శ్రద్ధ, విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో చూపలేదని విమర్శించారు. సమస్యలతో విద్యార్థులు సహజీవనం చేస్తున్నారని మండిపడ్డారు. 300 పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవనంలోనే మెడికల్ కళాశాలను నిర్వహించడం దారుణమన్నారు. మెడికల్ కళాశాల భవనం ఇంకా నిర్మాణంలోనే ఉందని చెప్పారు. విద్యార్థులకు వసతి సౌకర్యం లేదని, కళాశాలకు ప్రహరీ నిర్మించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేటు వ్యక్తులకు కాకుండా ఫుడ్ సప్‌లైయ్‌కు టెండర్ నిర్వహించాలని కోరారు. తక్షణమే ప్రభుత్వ యంత్రాంగం స్పందించి మెడికల్ కళాశాలకు పూర్తి స్థాయిలో సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రవికుమార్, రామాంజనేయులు, మురళిధర్‌రెడ్డి, కేకే రెడ్డి, బండల వెంకట్రాములు, రాజగోపాల్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment