
సంగమేశ్వరా.. దారి చూపవా..
●
కృష్ణాతీరంలోని సంగమేశ్వరుని దర్శనానికి సరిహద్దు పంచాయితీ
● ఏపీ పరిధిలోని ఆలయం చెంతకు తెలంగాణ బోట్లను రానివ్వకుండా అడ్డుపడుతున్న ఏపీ జాలర్లు
● స్వామి దర్శనానికి
భక్తులకు తప్పని కష్టాలు
● ఏడాదిలో నాలుగు నెలలు మాత్రమే సంగమేశ్వరుడి దర్శనం
పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు..
కొల్లాపూర్ మండలం, నాగర్‌కర్నూల్ జిల్లా)
సోమశిల వద్ద కృష్ణాతీరం వద్దకు హైదరాబాద్, ఇతర ప్రాంతాల నుంచి నిత్యం పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు. సంగమేశ్వరుడి దర్శనం కోసం కృష్ణానదిలో బోటులో వెళ్లాల్సి ఉండగా, ఏపీకి చెందిన సిద్దేశ్వరం, సంగమేశ్వర గ్రామాల జాలర్లు బోట్లను రానివ్వడం లేదు. కొద్ది దూరం బోటులో, తర్వాత ఆటోలో, మళ్లీ బోటులో ప్రయాణిస్తూ కష్టాలు పడుతున్నారు. పర్యాటకులు, భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలి. – రామ్మోహన్, సోమశిల,
సాక్షి, నాగర్‌కర్నూల్: ఏడాదిలో నాలుగు నెలలు మాత్రమే ఆలయం తెరచుకుని ఉంటుంది. మిగతా కాలమంతా నీటిలోనే మునిగి ఉంటుంది. ఏడు నదులు ఒక చోట కలిసే సంగమేశ్వర క్షేత్రంలో స్వామిని దర్శనం చేసుకునేందుకు భక్తులకు ప్రయాసలు తప్పడం లేదు. కృష్ణాతీరానికి ఇరువైపులా ఉన్న స్థానిక గ్రామాల జాలర్లు, బోట్ల నిర్వాహకుల మధ్య వివాదం, ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య సరిహద్దు పంచాయితీని తీసుకువచ్చింది. ఫలితంగా సంగమేశ్వరుడి దర్శనం కోసం వస్తున్న భక్తులు, పర్యాటకులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
సప్త నదుల సంగమం, ఏడాదిలో
నాలుగు నెలలే దర్శనం..
కృష్ణానది ఒడ్డున ఉన్న సంగమేశ్వర ఆలయం శ్రీశైలం రిజర్వాయర్ నిర్మాణ సమయంలో బ్యాక్‌వాటర్‌లో మునిగిపోయింది. ఆంధ్రప్రదేశ్‌లోని కొత్తపల్లి మండల పరిధిలో ఉన్న సంగమేశ్వర ఆలయం ప్రతి ఏటా వేసవిలో శ్రీశైలం ప్రాజెక్ట్ నీటి మట్టం తగ్గాక ఆలయం కనిపిస్తుంది. మార్చి నుంచి జూన్ వరకు రిజర్వాయర్‌లో నీరు లేని సమయంలోని భక్తుల దర్శనానికి అందుబాటులో ఉంటుంది. మిగతా ఏడాదంతా నీటిలోనే మునిగి ఉంటుంది. కృష్ణ, వేణి, తుంగ, భద్ర, మలాపహారిణి, భీమారథి, భవనాశిని నదులు ప్రవహించే ఏడు నదుల సంగమ క్షేత్రంగా సంగమేశ్వరాన్ని పేర్కొంటారు. ఆలయంలో శివలింగాన్ని పాండవుల్లో ఒకరైన భీముడు రాయితో కాకుండా వేపధారు(చెక్క)తో ప్రతిష్ఠించడం ఇక్కడి ప్రత్యేకత.
ఇరు రాష్ట్రాల జాలర్ల మధ్య సరిహద్దు వివాదం..
సంగమేశ్వర ఆలయాన్ని దర్శించుకునేందుకు హైదరాబాద్, ఇతర జిల్లాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు నాగర్‌కర్నూల్ జిల్లాలోని కృష్ణాతీరంలో ఉన్న సోమశిలకు చేరుకుంటారు. అక్కడి నుంచి బోటులో సంగమేశ్వర ఆలయానికి చేరుకోవాల్సి ఉంటుంది. అయితే ఆలయం ఏపీ పరిధిలో ఉండటంతో సంగమేశ్వరం, సిద్దేశ్వరం గ్రామాలకు చెందిన జాలర్లు, బోట్ల నిర్వహకులు తెలంగాణ నుంచి వచ్చే బోట్లను అడ్డుకుంటున్నారు. తమకు ఆదాయం రావడం లేదని అభ్యంతరం చెబుతుండటంతో తరచుగా వివాదం చెలరేగుతోంది. దీంతో కొన్ని రోజులుగా సంగమేశ్వర దర్శనం కోసం వస్తున్న భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. మొదట తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లా సోమశిల నుంచి బోటులో బయలుదేరితే ఏపీ పరిధిలోని సిద్దేశ్వరం తీరం వద్ద బోటును నిలిపివేస్తున్నారు. అక్కడి నుంచి 3 కి.మీ. దూరంలోని సంగమేశ్వరం వరకు ఆటోలో ప్రయాణించి ఆలయాన్ని చేరుకుంటున్నారు. దర్శనం తర్వాత ఆటోలో సిద్దేశ్వరం వరకు వచ్చి, అక్కడి కృష్ణానదిలో ఏపీకి చెందిన జాలర్ల బోట్లలో సోమశిలకు చేరుకోవాల్సి వస్తోంది. ఇందుకోసం ఒక్కొక్కరికి రూ.300 ఖర్చు అవుతుంది. 3 గంటల సమయం పడుతోంది. ఇరు రాష్ట్రాల జాలర్ల సరిహద్దు వివాదంతో పర్యాటకులు, భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కృష్ణాతీరంలోని సంగమేశ్వరుడి ఆలయం

సంగమేశ్వరా.. దారి చూపవా..

సంగమేశ్వరా.. దారి చూపవా..