సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): హస్తకళలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జీవం పోస్తున్నాయి. వాటిపై ఆధారపడిన కళాకారులను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. గతంలో హస్తకళాకారులకు చేతినిండా పని ఉండేది. వారు తయారుచేసిన వస్తువులకు ఎంతో డిమాండ్ ఏర్పడేది. రానురాను వాటి స్థానాన్ని చైనా మార్కెట్ ఆక్రమించింది. చైనా వస్తువులు తక్కువ ధరకు దొరకడంతో జనం మెల్లగా వాటికి అలవాటు పడిపోయారు. మన కళాకారులు చేతితో చేసిన వాటికి సమయం ఎక్కువ పట్టడం, శ్రమ కూడా అధికంగా ఉండటంతో వాటి ధర కుంచెం ఎక్కువగా ఉండేవి. కానీ చైనా నుంచి వచ్చేవి మెషీన్‌తో తయారు చేసిన కావడం, కొత్త మోడళ్లలో లభించడంతో జనాలు వాటికి ఆకర్షితులయ్యారు. దీనితో హస్తకళాకారులు ఉపాధి లేక ఇబ్బందులు పడ్డారు.
ప్రభుత్వాల ప్రోత్సాహం
దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మన కళాకారులను ప్రోత్సహిస్తున్నాయి. రాష్ట్ర ఇండస్ట్రీ, కామర్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ కె.సునీత, ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్ పర్సన్ బి.విజయలక్ష్మి, ఏపీ హస్తకళల అభివృద్ధి సంస్థ వీసీ, మేనేజింగ్ డైరెక్టర్ ఎం. బాలసుబ్రమణ్యం రెడ్డి, ఏపీ హస్తకళల అభివృద్ధి సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం.విశ్వ అనేక చర్యలు చేపడుతున్నారు. అంతర్జాతీయ సమ్మిట్‌లు నిర్వహించినప్పడు లేపాక్షి ద్వారా వివిధ రకాల హస్తకళలను ప్రదర్శించి అంతర్జాతీయ మార్కెట్‌ను పెంచుతున్నారు. విశాఖపట్టణంలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్, జీ 20 సదస్సు తదితర వాటిలో లేపాక్షిని ప్రమోట్ చేశారు. అలాగే వన్ డిస్ట్రిక్ట్, వన్ ప్రొడక్ట్ పేరుతో ఆయా జిల్లాలో ప్రసిద్ధి చెందిన వస్తువులను అంతర్జాతీయ మార్కెట్‌కు చేరువ చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ వెళ్లినప్పుడల్లా తిరుపతిలో తయారు చేసిన వుడ్ కార్వింగ్‌లను ప్రధానమంత్రి మోదీ, ఇతర నాయకులకు బహుమతులు అందజేస్తున్నా రు. తద్వారా వాటికి ప్రాచూర్యం కల్పిస్తున్నారు.
1982లో ప్రారంభం
ఆంధ్రపదేశ్ హస్తకళ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మన రాష్ట్రంలో 14 లేపాక్షి షోరూమ్‌లు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా రాజమహేంద్రవరంలోని గోకవరం బస్టాండ్ వద్ద 1982లో లేపాక్షి ఎంపోరియం నెలకొల్పారు. ఇక్కడకు జిల్లా వాసులతో పాటు ఎన్‌ఆర్‌ఐలు తరచూ వస్తారు. హస్తకళావస్తువులను కొనుగోలు చేసి, తమ స్నేహితులకు, బంధువులకు బహుమతిగా అందజేస్తారు. వన్ ప్రొడక్ట్, వన్ డిస్ట్రిక్ట్‌లో భాగంగా తూర్పుగోదావరిలో వైట్ వుడ్ బర్డ్స్, రత్నం పెన్నులు, కాకినాడ జిల్లాలో కలంకారి బ్లాక్ ప్రింటింగ్ ఎంతో ప్రాచుర్యం పొందాయి. రాజమహేంద్రవరం పేరు తలచుకోగానే రత్నం పెన్నులు గుర్తుకు వస్తాయి. 1930లో మొదలు పెట్టిన ప్రస్తానం నేటికి నిరంతరంగా కొనసాగుతోంది. మహాత్మా గాంధీజీ సైతం ఈ పెన్నులను ప్రశంసించారు. మెషీన్లు అందుబాటులోకి వచ్చినా నేటీకీ చేతితోనే ఈ పెన్నులను తయారు చేస్తారు.
● 50 ఏళ్లుగా..
మా నాన్న ఎం.చిన్న సత్యం వైట్ వుడ్ బర్డ్స్ తయారు చేసేవారు. ఆయన నుంచి నేను ఈ కళను నేర్చుకున్నాను. తూర్పుగోదావరి జిల్లాకి నా కళను ఎంపిక చేయడం ఆనందంగా ఉంది. గత 50 ఏళ్లుగా ఈ వృత్తిలోనే కొనసాగిస్తున్నాను. ఏపీ, తెలంగాణలో అన్ని లేపాక్షి షోరూమ్‌లో నా వైట్‌వుడ్ బర్డ్స్‌ని తీసుకుంటున్నారు.
– ఎం.నాగరాజు, వైట్ వుడ్ బర్డ్స్ తయారీ దారుడు
Comments
Please login to add a commentAdd a comment