సాక్షిప్రతినిధి,కాకినాడ: రైళ్లలో తాజాగా వందే భారత్‌కున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ రైలు ఎక్కేందుకు ప్రయాణికులు ఆసక్తి చూపుతున్నారు. టికెట్ ఖరీదెక్కువైనా సమయం కలిసి వస్తుండటంతో ఎగువ మధ్య తరగతి వర్గాలు తగ్గేదే లేదంటూ జై వందే భారత్ అంటున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒక్క రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్‌లో మాత్రమే ఇప్పటివరకూ ఈ ట్రైన్ ఆగుతుంది. కాకినాడ జిల్లాలో రైల్వేపరంగా కీలకమైన సామర్లకోట జంక్షన్‌లో దాదాపు చాలా సూపర్ ఫాస్ట్ రైళ్లు ఆగుతున్నా వందేభారత్ మాత్రం ఆగదు.
ఇక్కడ హాల్ట్ లేకపోవడంతో ప్రయాణికులు ఆవేదన చెందేవారు. గురువారం నుంచి వీరి వేదన తొలగిపోనుంది. సామర్లకోట రైల్వే జంక్షన్‌లో హాల్టుకు రైల్వేశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఈ ప్రాంతానికి చెందిన వారిలో ఆనందోత్సాహం వ్యక్తమవుతోంది. గురువారం తొలిసారి ఆగనున్న సందర్భంగా వందేభారత్‌కు ఘనంగా స్వాగతించేందుకు రైల్వే అధికారులు ఏర్పాట్లు చేశారు. సికింద్రాబాద్–విశాఖపట్నం నుంచి బయలుదేరే ఈ రైలు స్టేషన్‌లో ఒక నిమిషం ఆగుతుంది. ఇక్కడి హాల్టుతో రాజమహేంద్రవరానికి రెండు గంటలు వ్యయ ప్రయాసలు పడి అటు కోనసీమ, ఇటు కాకినాడ జిల్లాల ప్రయాణీకులు రైలు ఎక్కుతున్నారు.
ఆరంభం నుంచి డిమాండ్
ప్రారంభం నుంచి వందే భారత్‌కు సామర్లకోట జంక్షన్‌లో హాల్ట్ కావాలని ప్రయాణికులు కోరుతున్నారు. విశాఖపట్నం–విజయవాడ మధ్య నడిచే సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణీకులు కాకినాడకు వెళ్లాలంటే సామర్లకోట జంక్షన్‌లో రైలు దిగాలి. మెట్ట ప్రాంత మండలాల నుంచి సామర్లకోట వచ్చి విజయవాడ, హైదరాబాద్, విశాఖపట్నం, శ్రీకాకుళం వైపు ప్రయాణిస్తుంటారు. ఈ ప్రాంత ప్రయాణీకులతో పాటు మైదాన ప్రాంతంలోని కాకినాడ, తుని, పిఠాపురం పట్టణ ప్రయాణికులు కూడా సామర్లకోటలో హాల్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ప్రాంత మనోభావాలను ఎంపీ వంగా గీత కేంద్ర రైల్వేశాఖమంత్రి అశ్విన్‌వైష్ణవ్ దృష్టికి తీసుకు వెళ్లారు. మంత్రి సానుకూల స్పందన ఫలితంగా రైల్వేబోర్డు హాల్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 48 గంటల వ్యవధిలోనే ఆమోదం లభించడంతో ప్రయాణీకుల సంతోషపడుతున్నారు.
ఆ లోటు భర్తీ అయ్యేనా
సామర్లకోట రైల్వే జంక్షన్ నుంచి విశాఖపట్నం, విజయవాడ మీదుగా రోజుకు 80 (ఆప్ అండ్ డౌన్) ఎక్స్‌ప్రెస్‌రైళ్ళు రాక పోకలు సాగిస్తున్నాయి. వీటిలో 50 సూపర్ పాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లే కావడం విశేషం. మిగిలినవి ఎక్స్‌ప్రెస్ రైళ్లు. రోజూ ఈ జంక్షన్ నుంచి ఏడెనిమిది వేల మంది ప్రయాణిస్తున్నారని రైల్వే అంచనా. ప్రస్తుతం వందేభారత్ రైలులో ఉమ్మడి జిల్లా నుంచి రోజూ 350 మంది ప్రయాణిస్తున్నారు. అయినా రైలులో సీట్లు ఖాళీగానే ఉంటున్నాయి. సామర్లకోట జంక్షన్‌లో హాల్డ్‌కు గ్రీన్ సిగ్నల్ లభించడంతో ఆ లోటు భర్తీ అవుతుందని రైల్వే అధికారులు విశ్వసిస్తున్నారు. ఇకపై రాజమహేంద్రవరం వెళ్లాల్సిన అవసరం లేకుండానే సామర్లకోట హాల్ట్‌తో తమకు వందేభారత్ అందుబాటులోకి వస్తోందని కాకినాడ జిల్లా ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణ సమయం గంట నుంచి రెండు గంటలు తగ్గుతుందని ఆసక్తి చూపుతున్నారు.
హాల్ట్‌కు సర్వం సిద్ధం
వందేభారత్ హాల్ట్ సామర్లకోట జంక్షన్‌కు ఇవ్వడంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఇక్కడ ఆగేది ఒక్క నిమిషమే. ఈ సమయాన్ని ప్రయాణీకులు సద్వినియోగం చేసుకోవాలి. సామర్లకోటలో హాల్ట్‌కు ఆమోదం లభించడంతో ఇప్పటికే హాల్ట్ ఉన్న రైల్వే స్టేషన్‌లలో ప్రయాణ సమయాల మార్పును ప్రయాణీకులు గమనించాలి.– ఎమ్ రమేష్, స్టేషన్ మేనేజర్.సామర్లకోట.
వందేభారత్ (20833) వేళలు ఇలా
ఈ రైలు విశాఖ నుంచి సామర్లకోటకు ఉద యం 7–14గంటలకు చేరుకుంటుంది. 7–15 గంటలకు తిరిగి బయలుదేరి మధ్యాహ్నం 2–15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
సికింద్రాబాద్ నుంచి 20834నంబర్‌తో మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి రాత్రి 9–34 గంటలకు సామర్లకోట చేరుకుంటుంది. నిమిషం తర్వాత తిరిగి బయలుదేరి విశాఖ వెళుతుంది.
Comments
Please login to add a commentAdd a comment