నామినేటెడ్ పదవులపై పూటకో మాట
తొలుత ఐవీఆర్‌ఎస్ సర్వే పేరుతో కొందరికి మొండిచేయి
తాజాగా ఎమ్మెల్యే లేఖలకే ప్రాధాన్యమని వెల్లడి
బాబు వైఖరిపై తమ్ముళ్ల అసంతృప్తి
సాక్షి, రాజమహేంద్రవరం: నామినేటెడ్ పదవుల భర్తీలో టీడీపీ అధినేత చంద్రబాబు వ్యవహార శైలి పార్టీ శ్రేణుల్లో అగ్రహావేశాలు నింపుతోంది. రోజుకో మాట.. పూటకో ప్రతిపాదన తెరపైకి వస్తుండటంతో సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేసిన తమకు నామినేటెడ్ పదవులు దక్కుతాయా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇప్పటి వరకు పార్టీ కోసం శ్రమించిన నేతలకు పట్టం కడతామన్న చంద్రబాబు.. తాజాగా ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల సిఫార్సులకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిసింది.
ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలు, ఇతర ముఖ్య నేతలకు ప్రత్యేకంగా ఆన్‌లైన్ లింకులు పంపి వారితో ఆశావహుల పేర్లను తెప్పించుకోవడాన్ని బట్టి చూస్తే కష్టపడిన వారికి పదవులు దక్కే పరిస్థితి కనిపించడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే అదునుగా భావించిన తూర్పుగోదావరి జిల్లాలోని కొందరు నేతలు తమ బంధువులు, తమ అనుయానులు, నమ్మినబంట్లకు పదవులు కట్టబెట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నారు.
సిఫార్సులకు పెద్దపీటా?
ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే స్థానాలు దక్కని, క్రియాశీల పాత్ర పోషించిన పార్టీ శ్రేణులకు నామినేటెడ్ పదవులు ఇస్తామన్న సీఎం చంద్రబాబు ప్రకటనతో ఆశావహులు సంబరాలు చేసుకున్నారు. తమ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కుతుందని ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు ఆశించారు. ఆగస్టు నెలలోపు అన్ని పదవులు భర్తీ చేస్తామని స్పష్టీకరించడంతో ఉత్సాహంగా టీడీపీ అధిష్టానానికి దరఖాస్తు చేసుకున్నారు. ఎమ్మెల్యేలు, ఆయా నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జిల సిఫార్సు లేఖలు సైతం దరఖాస్తులకు జత చేశారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ఏడు నియోజకవర్గాల నుంచి పార్టీకి పెద్ద ఎత్తున దరఖాస్తులు చేరాయి. ఇంకేముంది పదవి రావడమే తరువాయి అని అనుకుంటున్న తరుణంలో చంద్రబాబు ఎంపికలో కొత్త మెలిక పెట్టారు. పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌చార్జిలు, ఇతర ప్రధాన నేతలకు ప్రత్యేకంగా ఆన్‌లైన్ లింక్‌ను పంపినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం.
ఇప్పటికే ఐవీఆర్‌ఎస్ సర్వే
సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా గట్టెక్కాలన్న ఉద్దేశంతో అలవిగాని హామీలు గుప్పించారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఆయన మాటలకు ఆకర్షితులైన టీడీపీ శ్రేణులు పార్టీ విజయానికి శక్తి వంచన లేకుండా కృషి చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చింది.. ఇంకేముంది నామినేటెడ్ పదవులు వరిస్తాయన్న టీడీపీ శ్రేణుల ఆశలపై సీఎం చంద్రబాబు నీళ్లు చల్లారు. పార్టీ నిర్వహించే సర్వేలో ఉత్తముడని తేలితేనే పదవి కట్టబెట్టేందుకు సిద్ధమయ్యారు.
ఐవీఆర్‌ఎస్ పేరుతో ప్రజలకు ఫోన్లు, వాట్సాప్ లింక్‌లు పెట్టి అభిప్రాయాల సేకరణ చేపట్టారు. నియోజకవర్గ, పార్లమెంట్, గ్రామ స్థాయి పోస్టుల కోసం కష్టపడిన వారి పేర్లతో సర్వే విస్తృతం చేశారు. ఒక్కో నియోజకవర్గంలో ఐదుగురి పేర్లతో సర్వే చేపట్టారు. పార్టీ శ్రేణులు, ప్రజలకు నేరుగా ఫోన్లు చేయడం నామినేటెడ్ పదవి ఆశిస్తున్న వారి పేర్లతో అభిప్రాయాలు సేకరించారు. ఎవరైతే బాగుంటుంది? అని ఆరా తీశారు.
పంపకాలతో పరేషాన్
నామినేటెడ్ పోస్టుల పంపకాలపై కసరత్తు ప్రారంభించిన చంద్రబాబు కూటమి నేతలను పక్కనబెడితే వ్యతిరేకత వ్యక్తమవుతుందని భావించి పంపకాలకు తెర తీశారు. ఇప్పటికే నిర్వహించిన ఐవీఆర్‌ఎస్, ఇంటెలిజెన్స్ సర్వే ప్రక్రియను పక్కనబెట్టారు. టీడీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం పరిధిలోని 60 శాతం నామినేటెడ్ పోస్టులు ఆ పార్టీ కార్యకర్తలకే దక్కుతాయి. 30 శాతం జనసేనకు, 10 శాతం బీజేపీకి కేటాయిస్తారు. జనసేన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో 60 శాతం ఆ పార్టీ కార్యకర్తలకు, 30 శాతం టీడీపీకి, 10 శాతం బీజేపీకి వరించేలా నిర్ణయం తీసుకున్నారు.
ఈ పరిణామం బీజేపీ నేతల్లో అగ్రహావేశాలు నింపింది. జాతీయ పార్టీ నేతలకు కేవలం పది శాతం కేటాయించడంపై వారు వ్యతిరేకత వ్యక్తం చేశారు. దీంతో వెనక్కు తగ్గిన బాబు ఏం చేయాలో అర్థంకాక మరో విధానానికి తెర తీశారు. ఎమ్మెల్యేల సిఫార్సులు తప్పనిసరి అని చెప్పడంతో కష్టపడిన నేతలకు కాకుండా ఎమ్మెల్యేల అడుగులకు మడుగులొత్తిన వారికి మాత్రమే పదవులు దక్కే అవకాశం ఉందన్న భావన ఆ పార్టీ శ్రేణుల్లోనే వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు తమ అనుచరుల పేర్లను అధిష్టానానికి ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం.
ఇద్దరు ప్రధాన నేతలకూ మొండిచేయేనా..?
⇒ నామినేటెడ్ పదవుల నియామకంలో టీడీపీ అధినేత చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని పరిశీలిస్తే తూర్పుగోదావరి జిల్లాలో ఇద్దరు ప్రధాన టీడీపీ నేతలకు నామినేటెడ్ దక్కే అవకాశాలు సన్నగిల్లుతున్నాయి.
⇒ టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా నిడదవోలు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావుకు ఎమ్మెల్యే సీటు గల్లంతైంది. అప్పట్లో చంద్రబాబు పిలిపించుకుని జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్, శేషారావు మధ్య సయోధ్య కుదిర్చారు. ఆ సమయంలో శేషారావుకు ఎమ్మెల్సీ ఇస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ప్రస్తుతం ఆయనతో పాటు మరో నేత పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఆ నేత పేరుతో అభిప్రాయ సేకరణ జరుగుతుండటంతో శేషారావుకు స్థానం దక్కడంపై సందిగ్ధం నెలకొంది. దీనికి తోడు శేషారావు వర్గానికి సైతం పూర్తి స్థాయిలో పదవులు దక్కే అవకాశాలు సన్నగిల్లుతున్నాయి.
⇒ రాజానగరం ఎమ్మెల్యే స్థానం జనసేనకు కేటాయించి టీడీపీ అభ్యర్థి బొడ్డు వెంకటరమణ చౌదరికి మొండిచేయి చూపారు. ఆయనకు ప్రభుత్వంలో కీలక పదవి ఇచ్చి గౌరవిస్తానని స్వయంగా చంద్రబాబు ప్రకటించారు. పదవిపై నేటికీ స్పష్టత ఇవ్వలేదు. దీనికి తోడు రాజానగరం మండలానికి చెందిన జనసేన నేతకు మరొక పదవి కట్టబెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరమైనట్లు తెలిసింది. ఇక్కడ జనసేన ప్రాతనిధ్యం వహిస్తుండడంతో 60 శాతం పదవులన్నీ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ వర్గానికి దక్కుతాయి. దీంతో బొడ్డు వర్గం పరిస్థితి ఏంటన్న ప్రశ్న టీడీపీ శ్రేణుల్లో ఉత్పన్నమవుతోంది. అంతేగాక బొడ్డు, ఎమ్మెల్యే బత్తుల వర్గాలకు మధ్య వర్గ విభేదాలు చాలానే ఉన్నాయి. బొడ్డుకు పదవిపై ఎమ్మెల్యే బత్తుల సహకరించే పరిస్థితి లేదు. జిల్లా వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితులే దర్శనమిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment