
కింకర్తవ్యం చెప్పు స్వామీ!
అన్నవరం దేవస్థానం
● రత్నగిరికి చివరి ర్యాంకుపై తర్జన భర్జన
● రేపు జిల్లా కలెక్టర్ సమీక్ష
● సూచనలతో ఆలయ సిబ్బంది సమాయత్తం
అన్నవరం: రత్నగిరికి ఏడో ర్యాంకుపైనే సర్వత్రా చర్చ. దేవస్థానంలో భక్తులకు అందిస్తున్న సేవలు, ప్రసాదం తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఐవీఆర్‌ఎస్ సర్వేలో చివరి ర్యాంకు రావడంపై స్వయంగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్ దృష్టి సారించారు. సోమవారం ఉదయం 11 గంటలకు దేవస్థానంలో ఆయన నిర్వహించనున్న సమీక్షపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సిబ్బంది పనితీరు, దాతల అసంతృప్తి, పాలనపై అధికారులకు పట్టు లేకపోవడం వంటి విషయాలు తీవ్ర చర్చినీయాంశమయ్యాయి.
పాతికేళ్ల క్రితం సైతం ఇలానే..
దేవస్థానంలో పాలన, ఆదాయ వ్యయాలపై ప్రణాళిక లేకపోవడంపై పాతికేళ్ల క్రితం ఇదే పరిస్థితి తలెత్తింది. అప్పటి ఈఓలకు పాలనాదక్షత లేకపోవడంతో కనీసం జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. అప్పటి దేవదాయ శాఖ మంత్రి ఆకస్మిక తనిఖీ చేసి ఈఓ ను మార్చి అడిషనల్ కమిషనర్ జి.కృష్ణమూర్తిని ఈఓగా నియమించి పరిస్థితిని దారిలోకి తీసుకువచ్చారు. ఆప్పుడే నిధులు లేకపోయినా ధైర్యం చేసి ప్రకాష్ సదన్ సత్రం నిర్మించారు. ఆ తరువాత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ ఎంవీ శేషగిరి బాబు ను ఈఓగా నియమించి పాలన సజావుగా సాగేలా తీర్చిదిద్దారు.
ప్రసాదం మినహా అన్నింటా అసంతృప్తి
ప్రముఖ పుణ్యక్షేత్రాలైన శ్రీశైలం, విజయవాడ దుర్గగుడి, శ్రీకాళహస్తి, సింహాచలం, అన్నవరం, ద్వారకాతిరుమల, కాణిపాకం దేవస్థానాలకు వచ్చిన భక్తుల నుంచి ఐవీఆర్‌ఎస్ పద్ధతిపై సర్వే చేసింది. ఈ దేవస్థానాలకు వచ్చిన 36,163 మంది భక్తుల నుంచి జనవరి రెండో తేదీ నుంచి ఫిబ్రవరి ఐదో తేదీ మధ్య నిర్వహించిన ఈ సర్వేలో భక్తులు ప్రసాదం మినహా అన్నింటా అసంతృప్తి వ్యక్తం చేశారు.
స్వామివారి దర్శనానికి పట్టే సమయంపై 78 శాతం మంది, మౌలిక వసతులపై 67 శాతం మంది, ప్రసాదంపై 13 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు.
అసంతృప్తికి కారణాలు
● భక్తుడు రత్నగిరి టోల్‌గేట్ వద్ద నుంచి మళ్లీ తిరుగుప్రయాణం అయ్యేవరకు ఖర్చు పెట్టే సొమ్ములో 40 శాతం మాత్రమే దేవస్థానానికి చేరుతోంది. మిగిలిన 60 శాతం దళారులు, ఇతరుల పాలవుతోంది. హుండీలో వేసిన కానుకలు, వ్రతం టిక్కెట్, దర్శనం టిక్కెట్టు, వివిధ వ్యాపారులు కట్టే లీజు మొత్తం మినహా మిగిలినదంతా ఇతరుల పాలవడం, దీనికితోడు భక్తులకు గౌరవ మర్యాదలు లేకపోవడం కూడా కారణంగా కనిపిస్తోంది.
● రత్నగిరిపై దుకాణాలల్లో సామగ్రి అధిక ధరలకు విక్రయించడం మరో కారణం. వ్యాపారులు వేలంలో పోటీపడి లీజు పెంచుకుని ఆ సొమ్మును ఇలా రాబట్టుకోవడం.
● గైడ్లు పేరుతో దళారులు స్వామి దర్శనం సులభంగా చేయిస్తామని అధిక వసూళ్లకు పాల్పడడం, సిబ్బంది సహాయ సహకారాలు లేకపోవడం.
● దేవస్థానం బస్సులలో టిక్కెట్లు ఇవ్వకుండా డబ్బులు వసూలు చేయడంతో ఆలయ ఆదాయానికి భారీగా గండి పడుతోంది.
● సిబ్బంది బాధ్యతా రాహిత్యంపై అధికారుల మెతకవైఖరి.
● ర్యాంకింగ్ వచ్చేరోజు స్వామివారి కల్యాణం గంటపాటు ఆలస్యమైనా అధికారులు చర్యలు తీసుకోవడంలో విఫలం. ఇలాంటి కారణాలెన్నెన్నో ఉన్నాయి.
అధికారులతో ఈఓ సమీక్ష
దేవస్థానం వ్యవహారాలపై సోమవారం జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహిస్తున్నందున శనివారం ఈఓ వీర్ల సుబ్బారావు ఏఈఓలు, సూపరింటెండెండ్లతో మొదటి ర్యాంకు సాధనకు తీసుకోవలసిన అంశాలపై సమీక్షించారు. పశ్చిమ రాజగోపురం ఎదురుగా విశ్రాంతి షెడ్డు నిర్మాణం త్వరగా చేపట్టాలని, పలుచోట్ల మరుగుదొడ్లు నిర్మించాలని, చెప్పుల స్టాండ్ ఉచితంగా నిర్వహించాలని. భక్తులతో దురుసుగా వ్యవహరించే వ్యాపారులకు జరిమానా విధించాలని, వ్రతాల సమయంలో నిరీక్షించే సమయం ఎక్కువ కాకుండా చూడాలని ఈ సమీక్షలో పలువురు సూచించారు.
రత్నగిరికి కొనుగోళ్లలో కొత్త నిబంధన
అన్నవరం: రత్నగిరి దేవస్థానంలో ఉపయోగించే పప్పులు, ఇతర దినుసుల సరఫరా టెండర్లలో పాల్గొనే వ్యాపారులు ఫుడ్ ఇనస్పెక్టర్ ఎంపిక చేసిన శాంపిల్స్ ప్రకారం సరఫరా చేయాల్సి ఉంటుంది. ఆ మేరకు నిబంధనలు మార్చారు. టెండర్ దారులు శాంపిల్స్‌ను అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ పరిశీలించి ఎంపిక చేసిన శాంపిల్ మేరకు వ్యాపారులు సరఫరా చేసేలా, దానికి ఒక ధరను కోట్ చేస్తూ టెండరు దాఖలు చేయాల్సి ఉంటుంది. శనివారం కొన్న నిత్యావసర వస్తువులు, పప్పుదినిసుల కొనుగోలుకు టెండర్‌దారులతో సమావేశం నిర్వహించి వారిచ్చిన శాంపిల్స్‌ను అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ శ్రీనివాస్ పరీక్షించి నివేదిక ఇచ్చారని సూపరిండెంట్ బలువు సత్యశ్రీనివాస్ తెలిపారు. ఆ శాంపిల్స్ ప్రకారం సరుకులు కొనుగోలు చేస్తామని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment