సాక్షి, నిజామాబాద్: నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కామారెడ్డి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ నడుం బిగించారు. ఇందులో భాగంగా ఈ నెల 23న కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో మెగా జాబ్ మేళా నిర్వహించాలని నిర్ణయించారు.
60 కంపెనీలకు చెందిన ప్రతినిధులు ఇందులో పాల్గొననున్నారు. వెయ్యి మంది ఉద్యోగావకాశాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు బీఆర్‌ఎస్ నాయకులు తెలిపారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీ, ఫార్మసీ, ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ వంటి కోర్సులు పూర్తి చేసిన వారికి అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. ఐటీ, పార్మా, బ్యాంకింగ్‌వంటి రంగాల్లో ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. జాబ్ మేళాపై నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ శ్రేణులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి.
నియోజకవర్గంలో చదువుకున్న వేలాది మంది ఉపాధి కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిర్వహించిన పరీక్షలకు వేలాది మంది హాజరయ్యారు. ఖాళీగా ఉండడం కన్నా ఏదో ఒక ఉద్యోగం చేసుకోవాలని ఆరాటపడుతు న్న నిరుద్యోగులు మేళాకు తరలివస్తారని భావిస్తున్నారు.
అరవైకిపైగా కంపెనీలు జాబ్‌మేళాలో పాల్గొని, తమకు కావలసిన ఉద్యోగుల కోసం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నాయి. ఆయా రంగాల్లో ప్రతిభావంతులైన వారిని ఎంపిక చేసి ఉద్యోగావకాశం కల్పిస్తాయి. ఈ మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని బీఆర్‌ఎస్ నేతలు కోరుతున్నారు.
విజయవంతం చేయండి
దోమకొండ: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 23న నిర్వహించే జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలని బీఆర్‌ఎస్ నాయకుడు గంప శశాంక్ కోరారు. సోమవారం మండల కేంద్రంలో ఆయన జాబ్‌మేళా పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు. జాబ్‌మేళాలో 60కిపైగా కంపెనీలు పాల్గొంటాయని తెలిపారు. కార్యక్ర మంలో జెడ్పీటీసీ తీగల తిర్మల్‌గౌడ్, సీడీసీ చైర్మన్ ఐరేని నర్సయ్య, సింగిల్ విండో చైర్మన్ పన్యాల నాగరాజ్‌రెడ్డి తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment