పెళ్లి చేయడం లేదని తండ్రి హత్య | - | Sakshi
Sakshi News home page

పెళ్లి చేయడం లేదని తండ్రి హత్య

Oct 22 2024 1:44 AM | Updated on Oct 22 2024 8:05 AM

-

సహజ మరణంగా చిత్రీకరించేందుకు ప్రయత్నం

నవీపేట మండలం అనంతగిరిలో ఘటన

పోలీసులకు ఫిర్యాదు చేసిన మృతుడి సోదరి

నవీపేట: తనకు పెళ్లి చేయడం లేదని, తాను దుబాయిలో ఉన్న సమయంలో పశువులను అమ్మేశాడనే కక్షతో తండ్రిని కొడుకు హత్య చేశాడు. సహజమరణంగా నమ్మించే ప్రయత్నం చేసి దొరికిపోయాడు. నవీపేట మండలం అనంతగిరి గ్రామంలో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించి నిజామాబాద్‌ నార్త్‌ రూరల్‌ సీఐ సతీశ్‌, ఎస్సై వినయ్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..

గ్రామానికి చెందిన గౌరు అమృతం(55) కుమారుడు గౌరు మహిపాల్‌ ఇటీవలే దుబాయి నుంచి గ్రామానికి వచ్చాడు. తల్లి లక్ష్మి గొట్టుముక్కలలో వేరుగా ఉంటోంది. ఏడాది కిందట మహిపాల్‌కు చెందిన పశువులను అమృతం అమ్ముకున్నాడు. తల్లిని వేరుగా ఉంచడం, తనకు పెళ్లి చేయకపోవడం, పశువులు అమ్ముకోవడంతో తండ్రిపై మహిపాల్‌ కక్షపెంచుకున్నాడు. అతడిని ఎలాగైనా చంపాలని నిర్ణయానికి వచ్చాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి తండ్రీకొడుకులు మద్యం సేవించారు. 

అమృతం మత్తులోకి జారుకోవడంతో అతడి గొంతుకు మహిపాల్‌ టవల్‌ బిగించి హత్య చేశాడు. సోమవారం ఉదయం ఆర్‌ఎంపీని పిలిపించి తన తండ్రి లేవడం లేదని చూపించగా చనిపోయినట్లు అతుడు ధ్రువీకరించాడు. అమృతానిది సహజ మరణంగా చిత్రీకరించిన మహిపాల్‌ బంధువులకు సమాచారమిచ్చాడు. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా అమృతం మెడపై గాయాలను గమనించిన అతడి సోదరి సావిత్రి అనమానంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు మహిపాల్‌ను విచారించగా తండ్రిని తానే చంపినట్లు ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

 

Advertisement
 
Advertisement
Advertisement