గొంతు తడిసేదెలా? | - | Sakshi
Sakshi News home page

గొంతు తడిసేదెలా?

Published Mon, Mar 17 2025 11:04 AM | Last Updated on Mon, Mar 17 2025 10:58 AM

వేసవి ప్రారంభంలోనే ఎండలు మండుతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటుతుండడంతో బోరుబావులు ఎత్తిపోతున్నాయి. మరోవైపు మిషన్‌ భగీరథ నీళ్లు సక్రమంగా సరఫరా కావడం లేదు. అప్పుడప్పుడు వస్తున్న నీళ్లు దాహార్తి తీర్చలేకపోతున్నాయి. సర్కారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో తాగునీటి సమస్యలపై ‘సాక్షి’ గ్రౌండ్‌ రిపోర్ట్‌.. – సాక్షి నెట్‌వర్క్‌

కిలోమీటరు దూరంనుంచి నీటిని తెచ్చుకుంటున్న పెద్దకొడప్‌గల్‌ మండలంలోని మనిసిరాం తండావాసులు

గోపాల్‌పేట ఎస్సీ కాలనీలో నల్లా వద్ద బిందెలు, బకెట్లతో మహిళల నిరీక్షణ

జిల్లాలో నీటి కష్టాలు మొదలయ్యాయి. పల్లె, పట్నం తేడా లేకుండా అంతటా తాగునీటి కోసం మైళ్ల దూరం వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో నీటి సమస్య తీవ్రరూపం దాల్చింది. మిషన్‌ భగీరథ నీరు చాలా గ్రామాలకు సరఫరా కావడం లేదు. కొన్నిచోట్ల నాలుగైదు రోజులకోసారి కూడా రావడం లేదు. వచ్చిన నీరు అందరికీ అందడం లేదు. ఇంకొన్ని చోట్ల ట్యాంకులు నిరుపయోగంగా ఉన్నాయి. మరోవైపు భూగర్భ జలమట్టం పడిపోయి బోర్లు కూడా ఎత్తిపోతున్నాయి. పంచాయతీ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తారనుకుంటే.. ఖజానా ఖాళీగా ఉందని, ట్రాక్టర్లను నడిపేందుకు డీజిల్‌ ఎక్కడినుంచి తెచ్చిపోయాలని పంచాయతీ కార్యదర్శులు చేతులెత్తేస్తున్నారు. ఇంటింటికి నల్లా ద్వారా నీరు సరఫరా కాకపోవడంతో కొన్ని గ్రామాల్లో పంచాయతీ బోర్ల వద్ద నుంచి మోసుకువెళ్తున్నారు. ఇంకొన్నిచోట్ల పొలాల వద్దకు వెళ్లి నీళ్లు తెచ్చుకోవాల్సి వస్తోంది.

పల్లెలు, తండాల్లో నీటి కష్టాలు...

గాంధారి మండలంలోని సోమ్లానాయక్‌ తండా, కర్ణంగడ్డతండా, గుడిముందు తండా, జెమినితండా, డప్పు తండాల్లో నీటి సమస్య తీవ్రంగా ఉంది. వ్యవసాయ బావుల వద్ద నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. ఎల్లారెడ్డి మండలంలోని సోమర్యాగడి తండాలో నీటి ఎద్దడితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నాగిరెడ్డిపేట మండలంలోని గోపాల్‌పేట ఎస్సీ కాలనీ, బద్యానాయక్‌ తండాల్లో నీటి కష్టాలు పెరిగాయి. రామారెడ్డి మండల కేంద్రంతో పాటు మొండివీరన్నతండా, సున్నపురాళ్ల తండాల్లో నీటి సమస్య తీవ్రంగా ఉంది. తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లి ఎస్సీ కాలనీలో నీటి సమస్య ఉంది. లింగంపేట మండలంలోని పర్మల్ల గ్రామంలో నీటికి ఇబ్బందులు పడుతున్నారు. రాజంపేట మండలం బస్వన్నపల్లిలో బోర్లు పడవు. దీంతో బావులే ఆధారం. ఒక బావిలో 15 మోటార్లు ఏర్పాటు చేసుకుని నీటిని తవ్వుకుంటున్నారు. సదాశివనగర్‌ మండలం అమర్లబండలో దశాబ్దాలుగా నీటి సమస్య తీరడం లేదు. గ్రామ శివారు నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. పెద్దకొడప్‌గల్‌ మండలంలోని కుబ్యానాయక్‌ తండా, పోచారం తండా, సముందర్‌తాండాలలో ప్రజలు పొలాల వద్దకు వెళ్లి నీరు తెచ్చుకోవాల్సి వస్తోంది. పిట్లం మండలం అన్నారంలో కిందిగల్లీలో నీటి సమస్య తీవ్రంగా ఉంది. బిచ్కుంద మండల కేంద్రంలోని పలు ప్రాంతాల్లో మిషన్‌ భగీరథ నీరు సరఫరా కావడం లేదు. ఎల్లారం తండాలో ప్రజలు వ్యవసాయ బోర్ల వద్ద నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. బాన్సువాడ మండలంలోని కాద్లాపూర్‌లో నీటి కష్టాలు పెరిగాయి. నల్లాల ద్వారా రాకపోవడంతో బోర్ల వద్ద నుంచి తెచ్చుకుంటున్నారు. రాజారాం దుబ్బ, అవాస్‌పల్లి ప్రాంతాల్లోనూ నీటికి కష్టాలు ఎదుర్కొంటున్నారు.

వ్యవసాయ బావినుంచి నీటిని తెచ్చుకుంటున్న సోమ్లానాయక్‌తండావాసులు

ఏ ఊరికి వెళ్లినా..

జిల్లాలో ఏ ఊరికి వెళ్లినా నీటి సమస్య కనబడుతోంది. మిషన్‌ భగీరథ నీరు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు నిలిచిపోతుందో తెలియని పరిస్థితి ఉంది. ఎస్సారెస్పీ గ్రిడ్‌ ద్వారా కామారెడ్డి ప్రాంతంలోని కామారెడ్డి, సదాశివనగర్‌, తాడ్వాయి, మాచారెడ్డి, రామారెడ్డి, బీబీపేట, భిక్కనూరు, రాజంపేట, దోమకొండ మండలాలకు నీటిని అందిస్తుండగా, సింగూరు గ్రిడ్‌ నుంచి ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, లింగంపేట, జుక్కల్‌, మద్నూర్‌, పెద్దకొడప్‌గల్‌, పిట్లం, బిచ్కుంద, డోంగ్లీ, మహ్మద్‌నగర్‌, బాన్సువాడ, బీర్కూర్‌, నస్రుల్లాబాద్‌ తదితర మండలాలకు నీటిని సరఫరా చేస్తారు. రెండు గ్రిడ్ల పరిధిలో చాలాచోట్ల పైప్‌లైన్ల సమస్య నీటి సరఫరాకు ఆటంకంగా మారుతోంది. రికార్డుల్లో మాత్రం అన్ని ఆవాసాలకు నీరు సరఫరా అవుతుందని చెబుతున్నా ఇప్పటికీ మిషన్‌ భగీరథ నీరు చేరని గ్రామాలెన్నో ఉన్నాయి.

మోటార్లు, ట్యాంకర్ల నిర్వహణ భారం...

పంచాయతీలకు నిధులు రాక, ఇప్పటికే రూ.లక్షలు అప్పులు తెచ్చి పెట్టిన కార్యదర్శులు బోర్ల నిర్వహణ, ట్యాంకర్లకు డీజిల్‌ తీసుకురావడం తమతో కాదని చేతులెత్తేస్తున్నారు. దీంతో పల్లెల్లో నీటి కష్టాలు మరింత పెరుగుతున్నాయి. గ్రామాలకు ప్రత్యేక అధికారులున్నా, వారు పర్యవేక్షణ మాత్రమే చేస్తున్నారు. డబ్బులు కార్యదర్శులే సర్దుబాటు చేయాల్సి వస్తోంది. దాదాపు ప్రతి కార్యదర్శి రూ. లక్ష నుంచి రూ.5 లక్షల వరకు అప్పులు చేసి మరీ పంచాయతీలను నెట్టుకువస్తున్నారు. తాగునీటి సమస్య పెరుగుతుండడంతో బోర్లు, మోటార్లు, ట్యాంకర్ల నిర్వహణకు డబ్బులు ఎక్కడి నుంచి తేవాలో తెలియక సతమతమవుతున్నారు. నీటి సమస్య పరిష్కారానికి నిధులు కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు.

పైప్‌లైన్‌ పనులు పూర్తయ్యేదెప్పుడో...

ఎస్సారెస్పీ గ్రిడ్‌లో భాగమైన కామారెడ్డి ప్రాంతానికి నీటిని అందించే పైప్‌లైన్‌ పగిలిపోయి ఒక్కోసారి వారం, పది రోజులు నీటి సరఫరా నిలిచిపోతోంది. ఈ నేపథ్యంలో సమస్య పరిష్కారం కోసం రూ.2 వందల కోట్లతో కొత్త పైపులైన్‌ పనులు చేపట్టారు. వేసవి సీజన్‌ వచ్చినా పనులు పూర్తి కాలేదు. అలాగే అమృత్‌–2 పథకం ద్వారా జిల్లా కేంద్రంలో పనులు నడుస్తున్నాయి. జిల్లా కేంద్రంలో భూగర్భ జలమట్టం పడిపోయి ఇళ్లల్లో బోర్లు ఎత్తిపోతున్నాయి. దీంతో గల్లీ వాసులంతా ఏకమై సొంతంగా తలా కొంత డబ్బు జమ చేసుకుని వెయ్యి నుంచి 15 వందల అడుగుల లోతు వరకు బోర్లు తవ్వించుకుంటున్నారు. నీరు పడితే ఎలాగోలా సర్దుకునే పరిస్థితి.. లేదంటే ట్యాంకులతో నీరు కొనాల్సిందే. పట్టణంలోని అశోక్‌నగర్‌, శ్రీరాంనగర్‌, ఎన్జీవోస్‌ కాలనీ, రుక్మిణికుంట, కాకతీయనగర్‌ తదితర ప్రాంతాల్లో నీటి కష్టాలు మొదలయ్యాయి. ట్యాంకర్‌కు రూ.5 వందలు వెచ్చించి నీటిని కొనుగోలు చేస్తున్నారు. నీటి సమస్య ఎదురవుతుందని తెలిసి కూడా పైప్‌లైన్‌ పనులు పూర్తి చేయకపోవడంతో ఈసారి కూడా ప్రజలకు కష్టాలు తప్పడం లేదు. గతంలో రోజు విడిచి రోజు నీరు సరఫరా అయ్యేది. ఇప్పుడు మూడు, నాలుగు రోజులకోసారి కూడా నీరు రావడం లేదు.

ముదురుతున్న ఎండలు..

ఎత్తిపోతున్న బోర్లు

సక్రమంగా సరఫరా కాని

‘భగీరథ’ నీళ్లు

తాగునీటి కోసం గోసపడుతున్న ప్రజలు

గొంతు తడిసేదెలా?1
1/4

గొంతు తడిసేదెలా?

గొంతు తడిసేదెలా?2
2/4

గొంతు తడిసేదెలా?

గొంతు తడిసేదెలా?3
3/4

గొంతు తడిసేదెలా?

గొంతు తడిసేదెలా?4
4/4

గొంతు తడిసేదెలా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement