నస్రుల్లాబాద్(బాన్సువాడ): పల్లె ప్రకృతి వనంలో మొక్కలు ఎండిపోతున్నా పట్టించుకోరా..? అంటూ నాచుపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి వినయ్‌పై సబ్ కలెక్టర్ కిరణ్మయి ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని నెమ్లి, నాచుపల్లి గ్రామాలను సబ్ కలెక్టర్ మంగళవారం సందర్శించారు. నెమ్లి గ్రామంలోని వెల్‌నెస్ సెంటర్‌ను సందర్శించిన ఆమె రిజిస్టర్‌లో సీఎల్ వేసి ఉండడాన్ని గమనించి సిబ్బంది విధుల్లోకి వస్తున్నారో లేదో పరిశీలించాలని తహసీల్దార్ ప్రవీణ్‌ను ఆదేశించారు. అనంతరం నాచుపల్లి గ్రామంలోని నర్సరీ, పల్లె ప్రకృతి వనం, గిరిజన మినీ గురుకుల బాలికల పాఠశాలను పరిశీలించారు. పల్లె ప్రకృతి వనంలో ప్రతి మొక్కనూ కాపాడాల్సిన బాధ్యత పంచాయతీ కార్యదర్శిదే అంటూ సూచించారు. మరొక సారి ఇలా జరిగితే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలంటూ ఎంపీడీవో సూర్యకాంత్‌ను ఆదేశించారు. అనంతరం నెమ్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో నిర్వహించిన పదో తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశంలో పాల్గొన్నారు. ఆమె వెంట తహసీల్దార్ ప్రవీణ్, ఎంపీడీవో సుబ్రమణ్యం, గిర్దావార్ సాయిలు, అంజు తదితరులు ఉన్నారు.
పంచాయతీ కార్యదర్శిపై
సబ్ కలెక్టర్ ఆగ్రహం