● గంగోత్రి రామానుజ దాసుస్వామి
● వైభవంగా కొనసాగుతున్న
‘ఇందూరు తిరుమల’ బ్రహ్మోత్సవాలు
మోపాల్(నిజామాబాద్‌రూరల్): మనుషులు సదా భగవంతుడికి కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలని ఆచార్య గంగోత్రి రామానుజ దాసుస్వామి అన్నారు. లోక కార్యానికి భగవంతుడు మనుషులను ఎంచుకుంటాడని, మనల్ని ఎంచుకునేలా అర్హత సాధించాలని తెలిపారు. మండలంలోని నర్సింగ్‌పల్లి ‘ఇందూరు తిరుమల’ ఆలయ 11వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆరోరోజు మంగళవారం యాగశాలలో మహా పూర్ణాహుతి నిర్వహించారు. ఆలయ పుష్కరిణిలో స్వామివారికి చక్రస్నానం, సాయంత్రం పుష్ప యాగం కార్యక్రమం చేపట్టారు. అనంతరం దేవనాథ జీయర్ స్వామి, ఆచార్య గంగోత్రి రామానుజ దాసుస్వామి భక్తులనుద్ధేశించి ప్రవచనాలు చేశారు. కలియుగంలో హరినామమే మోక్ష మార్గమని, ప్రతి క్షణం హరి నామం జపిస్తూ ఉండాలని సూచించారు. ఇందూరు తిరుమల దేవస్థానం ఇలలో మరో వైకుంఠంగా వెలుగొందుతుందన్నారు. వేడుకల్లో సినీ దర్శకుడు అనిల్ రావిపూడి, ఛాయాగ్రాహకుడు సమీర్‌రెడ్డి, హీరోలు నారాయణమూర్తి, ఆశిష్, ఆలయ ధర్మకర్తలు నర్సింహారెడ్డి, దిల్‌రాజు, శిరీష్‌రెడ్డి, విజయసింహారెడ్డి, హరీష్, సుదర్శన్‌రెడ్డి దంపతులు, ఆలయ కమిటీ సభ్యులు, వేద పండితులు పాల్గొన్నారు.
భగవంతుడికి కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలి