
ఎండల్లో.. కూడెల్లి పరవళ్లు
బీబీపేట : భూగర్భ జలాలు అడుగంటిపోతూ బో రుబావులు ఎత్తిపోతున్నాయి. నీరందక పంటలు ఎండుముఖం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో సిరిసిల్ల జిల్లాలోని ఎగువ మానేరును నింపడానికి కొండ పోచమ్మ సాగర్ ద్వారా వస్తున్న నీరు అన్నదాతల ఆశలను సజీవంగా నిలుపుతోంది.
కొండ పోచమ్మ సాగర్ ప్రాజెక్టు ద్వారా ఆరు రోజుల క్రితం నీటిని విడుదల చేశారు. అక్కడి నుంచి కొండ పోచమ్మ కెనాల్ ద్వారా కూడెల్లి వాగుకు నీటిని వదులుతున్నారు. ఈ నీరు గజ్వేల్, దుబ్బాక నియోజక వర్గాల మీదుగా ప్రవహించి జిల్లాలోని బీబీపేట మండలంలోని తుజాల్‌పూర్ గ్రామంలోని చెక్‌డ్యాంలోకి చేరుతోంది. దాని నుంచి దిగువన ఉన్న చెక్‌డ్యాం నిండి ఎగువ మానేరులోకి ప్రవహిస్తోంది. జిల్లాలో రెండు చెక్‌డ్యాంలు నిండిన తర్వాత ఎగువ మానేరువైపు నీళ్లు ప్రవహిస్తున్నాయి. ఎండాకాలంలో వాగు ప్రవహిస్తుండడంతో ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. నీరందక ఎండుముఖం పట్టిన పంటలకు గోదావరి జలాలు ఊపిరి పోశాయని రైతులు పేర్కొంటున్నారు.
పంటలకు జీవం పోసినట్టయ్యింది
రెండెకరాలలో వరి సాగు చేస్తున్నాను. ఎండలు రోజురోజుకు మండుతుండడంతో పంటలు ఎండిపోయే స్థితికి వచ్చాయి. ప్రభుత్వం కూడెల్లి వాగులోకి నీళ్లను వదలడంతో ఎండుతున్న పంటలకు జీవం పోసినట్టయ్యింది. పంట చేతికి వస్తుందన్న నమ్మకం వచ్చింది. – ప్రభాకర్, రైతు, మల్కాపూర్
కొండ పోచమ్మ సాగర్ ద్వారా గోదావరి జలాల రాక
చెక్‌డ్యాంలు నింపుతూ
ఎగువ మానేరులోకి చేరుతున్న నీరు