కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని శ్రీరాంనగర్ కాలనీలోగల సమన్విత ప్రైవేట్ ఆస్పత్రిలో కార్యకలాపాలు నిలిపివేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. డీఎంహెచ్‌వో చంద్రశేఖర్ బుధవారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. 2022లో శ్రీరాంనగర్ కాలనీలోని ఓ అద్దె భవనంలో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించిన కేసులో రాష్ట్ర, జిల్లా వైద్య శాఖ అధికారులు డెకాయ్ ఆపరేషన్ చేపట్టి సాక్ష్యాలతో కౌసల్య ఆస్పత్రిని సీజ్ చేశారు. ఇదే యజమాన్యం పేరు మార్చి అదే కాలనీలో సొంత భవనంలో సమన్విత పేరిట ఆస్పత్రిని ప్రారంభించింది. 2024లో లింగ నిర్ధారణ, శిశు విక్రయం వ్యవహారంలో పీసీపీఎన్‌డీటీ యాక్ట్ కింద పలు కేసులు నమోదు అయ్యాయి. అదే ఏడాదిలో స్కానింగ్ యంత్రాలు తరలిస్తుండగా పట్టుకుని మొబైల్ స్కానింగ్ చేస్తున్నారని యంత్రాలను, ఆస్పత్రిని సీజ్ చేసి కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో ఆస్పత్రి యాజమాన్యంలో ఒకరైన గాంధారి సీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్‌ను డీఎంహెచ్‌వో ప్రభుత్వానికి సరెండర్ చేశారు. ఈ నేపథ్యంలో ఆస్పత్రి యాజమాన్యం వైద్య ఆరోగ్యశాఖ తీరును సవాల్ చేస్తూ ఆరు నెలల క్రితం హైకోర్టును ఆశ్రయించి రిట్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపైన హైకోర్టు విచారణ చేపట్టగా.. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సాక్ష్యాధారాలను, షోకాజ్ నోటీస్ డాక్యుమెంట్లను హైకోర్టుకు సమర్పించింది. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు.. బుధవారం తీర్పునిచ్చింది. సమన్విత ఆస్పత్రిలో ఎలాంటి కార్యకలాపాలు కొనసాగించవద్దని, ఈ ఆస్పత్రిలో ఎలాంటి వైద్య సేవలు, చికిత్సలు నిర్వహించడానికి వీలులేదని ఆదేశాలు జారీ చేసింది.
మెడికల్ ఆఫీసర్ బదిలీ
సమన్విత ఆస్పత్రి యాజమాన్యంలో ఒకరైన గాంధారి ప్రభుత్వ ఆస్పత్రి మెడికల్ ఆఫీసర్ ప్రవీణ్‌ను గతంలోనే ప్రభుత్వానికి సరెండర్ చేశారు. క్రమశిక్షణ చర్యలలో భాగంగా అతడిని కుమురం భీం ఆసిఫాబాద్‌కు బదిలీ చేస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
కోర్టు ప్రతులను తీసుకోవడానికి నిరాకరణ
హైకోర్టు ఆర్డర్స్ ప్రతులను ఇవ్వడానికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది బుధవారం సాయంత్రం ఆస్పత్రికి వెళ్లారు. అయితే ఆర్డర్స్‌ను తీసుకోవడానికి ఆస్పత్రి యాజమాన్యం తిరస్కరించిందని వైద్యారోగ్య శాఖ అధికారులు తెలిపారు. దీంతో ఆస్పత్రి గోడకు కోర్టు ఆర్డర్స్ ప్రతులను అతికించామన్నారు. కోర్టు తీర్పు మేరకు ఆ ఆస్పత్రికి ఎవరూ వైద్యంకోసం రావద్దని డీఎంహెచ్‌వో చంద్రశేఖర్ సూచించారు.
లింగ నిర్ధారణ కేసులో ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు
గాంధారి ప్రభుత్వ ఆస్పత్రి
వైద్యుడిపై బదిలీ వేటు