
చిన్నారులను ఆకట్టుకునేలా..
ఎల్లారెడ్డిరూరల్: పిండి కేంద్రాలు అని పిలిచే ఒకప్పటి అంగన్‌వాడీ కేంద్రాలు.. ఇప్పుడు పూర్వ ప్రాథమిక విద్యను అందించే పాఠశాలల స్థాయికి ఎదిగాయి. పౌష్టికాహారంతోపాటు ఆటపాటలతో కూడిన విద్య అందిస్తుండడంతో ఆయా కేంద్రాలకు రావడానికి చిన్నారులు ఆసక్తి చూపుతున్నారు.
ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాలను పూర్వ ప్రాథమిక పాఠశాలలుగా అప్‌గ్రేడ్ చేస్తోంది. ప్రస్తుతం మండలానికి ఒక అంగన్‌వాడీ కేంద్రాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి వాటిలో పెయింటింగ్ వేసి రంగుల ప్రపంచంగా తీర్చిదిద్దారు. ఎల్లారెడ్డి మండలంలోని కట్టకిందితండా, నాగిరెడ్డిపేట మండలంలోని జలాల్‌పూర్–2, గాంధారి మండలంలోని ముదోలి, లింగంపేట మండలంలోని పోతాయిపల్లి గ్రామాలలోగల అంగన్‌వాడీ కేంద్రాలను అప్‌గ్రేడ్ చేసి నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇక్కడి కేంద్రాలలో పెయింటింగ్ ద్వారా ఫ్రూట్స్, వెజిటెబుల్స్, అల్ఫాబెట్స్, కార్టూన్స్, ఆనిమల్స్, మ్యాథ్స్‌కు సంబంధించిన చిత్రాలను వేయించారు. దీంతో చిన్నారులు ఆ చిత్రాలకు ఆకర్షితులై చదువుపై ఆసక్తి పెంచుకుంటున్నారు. వీటితో పాటు 9 అంశాలలో చిన్నారులకు విద్యాబోధన చేస్తున్నారు. ఆటలు, పాటలు, కథలు, సంభాషణ, మంచి అలవాట్లు, సృజనాత్మకత, శాసీ్త్రయ పరిజ్ఞానం, భాషా పరిచయం అంశాల ఆధారంగా విద్యను బోధిస్తున్నారు. అంకెలను గుర్తు పట్టడం, చదవడం, రాసే పద్ధతులను నేర్పుతున్నారు. జిగ్‌జాగ్ డ్రాయింగ్ ద్వారా అక్షరాలను రాసే విధానం నేర్పిస్తున్నారు. దీంతో అంగన్‌వాడీలకు రావడానికి పిల్లలు ఇష్టపడుతున్నారని వారి తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.
అంగన్‌వాడీల్లో పూర్వ ప్రాథమిక విద్య
9 అంశాల ద్వారా విద్యాబోధన
ఆసక్తిగా వస్తున్నారు
పాఠశాలలో వేసిన చిత్రాలకు చిన్నారులు ఆకర్షితులవుతున్నారు. రెగ్యులర్‌గా అంగన్‌వాడీకి వస్తున్నారు. ఇక్కడి గోడలపై ఉన్న చిత్రాలను చూసి ఇంటికి వెళ్లాక కూరగాయలు, పండ్లను గుర్తుపడుతుండడంతో వారి తల్లిదండ్రులు ఆనందిస్తున్నారు.
– మీరి, అంగన్‌వాడీ టీచర్, కట్టకింది తండా

చిన్నారులను ఆకట్టుకునేలా..

చిన్నారులను ఆకట్టుకునేలా..